అవినీతి, బంధుప్రీతిలో కూరుకుపోయిన HCA.. టికెట్లలో రూ.40 కోట్ల గోల్ మాల్??

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా అవినీతి, బంధుప్రీతిలో కూరుకుపోయింది. ఇక్కడి రాజకీయాలతో విసిగిపోయిన బీసీసీఐ కూడా కీలకంగా ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను పట్టించుకోవడం మానేసింది. చాలాకాలం తర్వాత 25వ తేదీన భారత్-ఆసీస్ మూడో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ను కేటాయించింది. మొదటి మ్యాచ్ మొహాలీలో జరగ్గా రెండోమ్యాచ్ నాగపూర్ లో జరగబోతోంది.

ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ కోసం ప్రేక్షుకుల కెపాసిటీ 55వేలు. స్పాన్లర్లకు పోను 38వేల టికెట్లు ఉండాలి. కానీ మూడువేల టికెట్లను జింఖానా మైదానంలో అమ్మకానికి పెట్టారు. అదీ ఆఫ్ లైన్ లో పెట్టారు. టికెట్ల కోసం తెల్లవారుజాము నుంచి వేచిచూస్తున్న అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగి పలువురు గాయపడ్డారు. తొక్కిసలాటను అదుపు చేయడానికి పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. 20 మంది అభిమానులు స్పృహ తప్పిపోగా, మరో 10 మంది పోలీసులు గాయాలపాలయ్యారు.

కౌంటర్ల వద్ద ఆన్ లైన్ పేమెంట్లకు సంబంధించి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో యూపీఐ పేమెంట్లు, కార్డులను తీసుకోలేదు. చేతిలో నగదు ఉన్నవారికే టికెట్లు విక్రయించారు. దీనిపై అభిమానులు మండిపడ్డారు. హెచ్ సీఏ ప్రణాళిక లేకుండా వ్యవహరించిందన్నారు. పాస్ ల జారీ కూడా గందరగోళంగా మారింది. వీఐపీ పాస్ ల కోసం తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. పోలీసుల లాఠీఛార్జి నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. నగర కమిషనర్ తోపాటు హెచ్ సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి హెచ్ సీఏ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, హదరాబాద్ కు చెడ్డపేరు తీసుకురావద్దని, హెచ్ సీఏలోని రాజకీయాలను ప్రభుత్వంపై రుద్దితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అవసరమైతే అసోసియేషన్ కు లీజుకిచ్చిన స్టేడియం స్థలాన్ని వెనక్కి తీసుకుంటామని, ప్రభుత్వమే స్టేడియాన్ని నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. టికెట్ల విక్రయంలో రూ.40 కోట్ల గోల్ మాల్ జరిగిందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురవారెడ్డి ఆరోపించారు. అజారుద్దీన్ వల్లే ఇలా జరిగిందన్నారు.

ఎన్ని టికెట్లు విక్రయానికి పెట్టాం? ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? నగదును ఎలా తీసుకోవాలి? అంచనాలకు మించి వస్తే అదుపు చేయడం ఎలా? ముందుగానే పరిస్థితిపై పోలీసులకు నివేదిక ఇవ్వకపోవడంవంటి ఎన్నో లోపాలతో జరిగింది. హెచ్ సీఏ అధ్యక్షుడిగా ఎంపికవడానికి అజారుద్దీన్ చేసిన ప్రయత్నాలు, కోర్టు కేసులు ఇవన్నీ ఇక్కడి పాలనపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇప్పటికైనా ఇక్కడి పరిపాలనా వ్యవహారాల్లో ప్రభుత్వం.. లేదంటే బీసీసీఐ పెద్దలు జోక్యం చేసుకోవాలని, లేదంటే గాడి తప్పిన హెచ్ సీఏ ఎప్పటికీ బాగుపడదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.