అమిత్ షా కీలకభేటీ.. పీఎఫ్ఐపై నిషేధం?

పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యాలయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌, ఇతర ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. పీఎఫ్‌ఐ కార్యకర్తలు, ఉగ్ర అనుమానితుల విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయమై భేటీలో చర్చించారు. యువతకు శిక్షణ పేరుతో పీఎఫ్ఐ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ అనుమానితులను తమ అదుపులోకి తీసుకుంటోంది.

ఉగ్రవాదం కోసం నిధుల సేకరణ, యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షింపచేయడం లాంటివి చేస్తుండటంతో ఈడీ అధికారులతో కలిసి దాడులు నిర్వహిస్తోంది. సంస్థపై నిషేధం విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అమిత్ షా భేటీ నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని పీఎఫ్‌ఐ కార్యాలయాలు, సభ్యుల ఇళ్లపై వారం రోజుల నుంచి దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 100 మందికి పైగా నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. యూపీలో పీఎఫ్‌ఐ మాజీ కోశాధికారి నదీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కేరళలో 22 మందిని అరెస్టు చేయగా.. తమిళనాడులో 10, ఉత్తరప్రదేశ్‌లో 8, మహారాష్ట్రలో 20, కర్ణాటకలో 20 మందిని అరెస్ట్ చేశారు. ఏపీలోని కర్నూలు, గుంటూరు, తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.