అమరావతిపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం – ఎన్నికల దిశగా..!!

అమరావతికి సంబంధించి మరో కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజధాని ప్రాంతంలోనే ఎన్నికల్లో తమ బలం నిరూపించుకొనేందుకు సిద్దం అవుతోంది. ఇప్పటికే మూడు రాజధానుల వ్యవహరానికి సంబంధించి సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా తమ విధానం స్పష్టం చేసారు. అమరావతిలో రాజధాని తాను వద్దనటం లేదని, అమరావతితో పాటుగా మరో రెండు ప్రాంతాల్లో రాజధాని ఉండాలని చెబుతున్నానని వివరించారు. అమరావతి పైన తనకు ఎటువంటి కోపం లేదన్నారు. తాజాగా, వికేంద్రీకరణ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరింది.

ఇప్పుడు అమరావతిని మున్సిపాల్టీగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అమరావతి మున్సిపాలిటీగా మారనుంది. గ్రామసభలు పెట్టి ప్రజాభిప్రాయం తీసుకునే ప్రక్రియ పూర్తికావడంతో ప్రభుత్వం ఇక అధికారిక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. తుళ్లూరు మండలంలోని 19, మంగళగిరి మండలంలోని మూడు పంచాయతీల్ని కలిపి.. మొత్తం 22 పంచాయతీలతో అమరావతిని మున్సిపాలిటీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రతిపాదన పైన రాజధాని గ్రామాల్లో ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసారు. గ్రామసభల అనుమతి లేకుండానే అధికారుల అభిప్రాయంతో అవసరమైన మార్పులు చేసుకోవచ్చంటూ సిఆర్‌డిఎ చట్టంలో ప్రభుత్వం మార్పులు చేసింది.

తాజాగా అసెంబ్లీలో అమోదించిన చట్టంతో ప్రభుత్వం అమరావతిని మున్సిపాల్టీగా ప్రకటిచేందుకు పూర్తి అధికారం దక్కింది. గతంలో కార్పొరేషన్‌గా మార్చినా దానికి తగినంత మంది ప్రజల నివాసం లేకపోవడంతో మున్సిపాలిటీ స్థాయిగానే దీన్ని పరిగణించనున్నారు. ఇంతకు ముందే అమరావతి పరిధిలో గ్రామాలన్నిటినీ పురపాలన శాఖ కిందకు తీసుకొచ్చినా పంచాయతీలుగానే ఉన్నాయి. ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీగా మార్చి వెంటనే ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఎన్నుకునే విధంగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. స్థానికసంస్థ ఏర్పాటైతే అనుకున్న విధంగా అక్కడ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం ఏర్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భూ వినియోగ మార్పిడి, కేటాయింపులన్నీ స్థానిక సంస్థ నిర్ణయాల ఆధారంగా జరుపుకునే అవకాశం ఉంది. మున్సిపాలిటీగా ఏర్పాటైన ఆరునెలల్లోపే వార్డులు విడగొట్టడం, ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, అమరావతి గ్రామాలతో మున్సిపాల్టీ ఏర్పాటు చేసి అక్కడ గెలవాలనేది వైసీపీ ముఖ్య నేతల పట్టుదలగా కనిపిస్తోంది. అక్కడ గెలిచి..తమ పట్టు నిరూపించుకొనేవాలనే ది లక్ష్యంగా ఉంది. ఇదే సమయంలో ప్రత్యేకాధికారి ద్వారా పాలన నిర్వహించే అంశాన్నీ పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో..అమరావతి కేంద్రంగా ప్రభుత్వం వేస్తున్న అడుగులు రాజకీయంగా ఉత్కంఠ పెంచుతున్నాయి. దీని పైన వారం పది రోజుల్లోనే ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.