OSCAR: అమెరికన్ సినిమాల అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? ఆస్కార్‌లో విదేశీ చిత్రాల ఎంట్రీకి నిబంధనలు ఏమిటి?

వచ్చే ఏడాది (2023) ఆస్కార్ అవార్డుల పోటీకి భారతదేశం నుంచి ‘ఛెల్లో షో’ అనే గుజరాతీ సినిమాను పంపిస్తున్నారు. పాన్ నళిన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో దిగుతుందనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా వెస్ట్ ప్రపంచాన్ని బాగా ఆకర్షించింది. ఆర్ఆర్ఆర్ సినిమాను మెచ్చుకుంటూ హాలీవుడ్ సెలబ్రిటీలు ట్వీట్ చేశారు. అమెరికా మీడియా సంస్థ ‘వెరైటీ’ కూడా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో ఉందని కథనం రాయడంతో విపరీతమైన హైప్ వచ్చింది. అలాగే, కశ్మీరీ ఫైల్స్ కూడా ఆస్కార్‌కు పోటీపడుతుందనే ప్రచారం జరిగింది. ఈ రెండూ బరిలో నిలవకపోయేసరికి అభిమానులు నిరాశపడ్డారు. ప్రస్తుతం ఇదే అంశం సోషల్ మీడియాలో చర్చల్లో ఉంది.

ఆస్కార్ అవార్డు పొందడం అంటే సినిమా ఫీల్డులో అత్యున్నత స్థాయికి చేరుకున్నట్టు భావిస్తారు. గతంలో ఏఆర్ రెహ్మాన్‌కు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు భారతదేశమంతా సంబరాలు చేసుకుంది. 2009లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలో ‘జై హో’ పాటకు రెహ్మాన్ ఆస్కార్ అందుకున్నారు.

ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డుల వ్యవహారం ఒక ఉత్సవంలా జరుగుతుంది. పోటీకి సినిమాలను పంపడం మొదలుకుని, అవార్డుల ప్రదానోత్సవం వరకు ఆస్కార్ అవార్డులకు సంబంధించిన వార్తలు ముఖ్యాంశాల్లో చోటుచేసుకుంటాయి.

ఎందుకు ఆస్కార్ అవార్డులకు అంత విలువ? హాలీవుడ్ సినిమాలు, అంటే అమెరికన్ సినిమాలకే ప్రత్యేకమైన ఈ అవార్డుకు ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఎలా వచ్చింది?

అకాడమీ అవార్డులనే ఆస్కార్ అవార్డులు అంటారు. అకాడమీ అవార్డులకు ఆస్కార్ అనే పేరు వచ్చిందన్న దానిపై ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి.

అకాడమీ అవార్డుల పుట్టుపూర్వోత్తరాల గురించి వాళ్ల అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం, 1927లో హాలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మెట్రో-గోల్డ్‌విన్-మేయర్ (ఎం-జీ-ఎం) చీఫ్ లూయిస్ బీ మేయర్ ఇంట్లో ఓ సాయంత్రం విందు భోజన సమయంలో అకాడమీ అవార్డుల ఆలోచనకు పునాది పడింది. చలనచిత్ర పరిశ్రమకు ప్రయోజనం చేకూరేలా ఒక వ్యవస్థీకృత సమూహాన్ని సృష్టించాలని లూయిస్ మేయర్, విందుకు వచ్చిన అతిథులతో చర్చించారు. ఇక్కడ చలనచిత్ర పరిశ్రమ అంటే అమెరికా చలనచిత్ర పరిశ్రమ అని గుర్తుంచుకోవాలి.

ఇది జరిగిన ఒక వారం తరువాత, సినిమా పరిశ్రమలోని అన్ని సృజనాత్మక శాఖల నుంచి 36 మంది ఆహ్వానితులు లాస్ ఏంజెల్స్ అంబాసిడర్ హోటల్‌లో సమావేశమయ్యారు. వారంతా కలిసి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌ (AMPAS)ను స్థాపించే ప్రతిపాదనపై చర్చించారు.

ఏ మాత్రం ఆలస్యం కాకుండా, ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. ఈ ఆర్గనైజేషన్‌లో చేర్చాల్సిన అంశాల గురించి ఆర్టికల్స్ సమర్పించారు. అకాడమీ బోర్డు ఏర్పాటైంది. సభ్యులను ఎన్నుకున్నారు. డగ్లస్ ఫెయిర్‌బ్యాంక్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

1928లో అకాడమీ బోర్డు ఏర్పాటు చేసిన తొలి కమిటీలలో ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ ఒకటి. ఏడుగురు సభ్యులున్న ఈ కమిటీ, 12 విభాగాల్లో అవార్డులు అందజేయాలని బోర్డుకు సూచించింది.

1929 మే 16న మొట్టమొదటి ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రూజ్‌వెల్ట్ హోటల్‌లోని బ్లోసమ్ రూమ్‌లో జరిగిన ఈ వేడుకకు 270 మంది హాజరయ్యారు. అప్పటికి మూడు నెలల క్రితమే అవార్డుల విజేతలను ప్రకటించారు.

ఆ తరువాతి సంవత్సరం, విజేతల పేర్లను ముందే ప్రకటించకుండా అవార్డుల ప్రదానోత్సవం వరకు గోప్యంగా ఉంచారు. అయితే, వేడుక రోజు రాత్రి 11.00 గంటలకల్లా వార్తాపత్రికల్లో ప్రచురించేందుకు వీలుగా మీడియా సంస్థలకు విజేతల పేర్లను ముందే పంపించారు.

1940 వరకు ఈ పద్ధతి కొనసాగింది. ఆ సంవత్సరం లాస్ ఏంజిల్స్ టైమ్స్ సాయంత్రం ఎడిషన్‌లోనే విజేతల పేర్లను ప్రచురించింది. దాంతో, ఆ సాయంత్రం అవార్డుల వేడుకకు వచ్చే అతిథులకు విజేతలెవరో ముందే తెలిసిపోయింది.

అప్పటినుంచి విజేతల పేర్లను కవర్‌లో పెట్టి సీల్ వేసే పద్ధతి ప్రారంభమైంది. అవార్డుల ప్రదానోత్సవం రోజు వేదికపై ప్రకటించేవరకు విజేతల పేర్లు గోప్యంగానే ఉంటాయి. ఇప్పటికీ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు.

విజేతల వివరాలను గోప్యంగా ఉంచడం అనే ప్రక్రియ ఉత్సుకత రేకెత్తించి. ఈ పద్ధతి మొదలైన రెండో ఏడాది లాస్ ఏంజిల్స్ టైమ్స్ అకాడమీ అవార్డుల వేడుకను రేడియోలో ప్రత్యక్ష ప్రసారం చేసింది.

1953 నుంచి అకాడమీ అవార్డుల వేడుకను టీవీలో ప్రసారం చేయడం ప్రారంభించారు. 1966లో తొలిసారిగా కలర్ టీవీలో అకాడమీ అవార్డుల ప్రత్యక్ష ప్రసారం జరిగింది.

1969 నుంచి అకాడమీ అవార్డులను అంతర్జాతీయంగా ప్రసారం చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం 200లకు పైగా దేశాల్లో అకడమీ అవార్డుల ప్రసారం జరుగుతోంది.

ప్రస్తుతం, హాలీవుడ్ సినిమాలకు 24 విభాగాల కింద అకాడమీ అవార్డులు ఇస్తున్నారు.

1947 వరకు అంటే అకడమీ అవార్డులు ఇవ్వడం మొదలెట్టిన దాదాపు 20 ఏళ్ల వరకు ఇందులో విదేశీ చిత్రాల విభాగం లేనేలేదు. కేవలం హాలీవుడ్ సినిమాలను మాత్రమే అవార్డులను అందిస్తూ వచ్చారు.

1947లో తొలిసారిగా ‘షూ-షైన్’ అనే ఇటాలియన్ సినిమాకి విదేశీ చిత్రాల విభాగంలో అవార్డును అందించారు. తరువాతి సంవత్సరాలలో మరో ఏడు విదేశీ చిత్రాలకు స్పెషల్ కేటగిరీ కింద అకాడమీ అవార్దులు అందించారు.

1956 నుంచి క్రమం తప్పకుండా ప్రతి ఏడాది పరభాషా చిత్రం (ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్) విభాగం కింద విదేశీ చిత్రాలకు అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు.

2019 వరకు ఈ విభాగాన్ని ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్’ అని పిలిచేవారు. 2020లో దీని పేరును ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్‌’గా మార్చారు.

అంతర్జాతీయ చిత్రాలు ఆస్కార్ బరిలోకి దిగాలంటే కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

ఇవి కాకుండా, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఎంట్రీకి అదనపు నిబంధనలు, ప్రత్యేక నిబంధనలు కూడా ఉంటాయి. ఇవి కాలానుగుణంగా మారుతుంటాయి. ఉదాహరణకు 2017 ఆస్కార్ అవార్డుల నిబంధనల్లో థియేటర్‌లో రిలీజ్ చేసిన సినిమాలను మాత్రమే ఆస్కార్ నామినేషన్‌కు పంపాలని ఉంది. కానీ, 2023 నిబంధనలలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైన సినిమాని కూడా పోటీకి పంపించవచ్చు.

అంతర్జాతీయ చిత్రాలకు 2023 నిబంధనలు ఇలా ఉన్నాయి..

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, విదేశీ చిత్రాల్లో వివిధ విభాగాలకు కాకుండా మొత్తం చిత్రానికి అవార్డు ప్రకటిస్తారు.

ఇది కేవలం హాలీవుడ్ సినిమాలను ఇచ్చే అవార్డు అయినప్పటికీ ఆస్కార్‌కు ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఎలా వచ్చింది?

సుదీర్ఘకాలంగా, దాదాపు తొమ్మిది దశాబ్దాలుగా స్థిరంగా ఈ అవార్డులను అందించడం, ఎప్పటికప్పుడు స్థాయిని మెరుగుపరుచుకుంటూ, ఒక క్రమపద్ధతిలో ఓ గొప్ప వేడుకలా నిర్వహించడం ఒక కారణం కావచ్చు.

ఆస్కార్ వేడుక ఇప్పటి యువతరానికి చేరువ అయ్యేలా అకాడమీ ప్రయత్నాలు చేస్తోందని బీబీసీ ఎంటర్టైన్మెంట్ రిపోర్టర్ స్టీవెన్ మెచ్ఇంటోష్ గతంలో అన్నారు.

అలాగే, గత శతాబ్ద కాలంలో అమెరికా ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ, అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తూ ప్రపంచ పటంలో పెద్ద దేశంగా అవతరించింది. అమెరికాలో జరిగే ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరగడం అన్ని రంగాల్లో కనిపించింది. అదే కోవలో ఆస్కార్ అవార్డులు కూడా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందాయి అనుకోవచ్చు.

అయితే, ఆస్కార్ అవార్డుల మీద విమర్శలూ ఉన్నాయి. “ఆస్కార్స్ ఆర్ సో వైట్” అన్న విమర్శ తరచుగా వినిపిస్తూ ఉంటుంది. 2016లో #OscarsSoWhite అనే హ్యాష్‌ట్యాగ్ ఉద్యమం కూడా నడిచింది. అకాడమీ అవార్డులు తెల్లజాతీయులకే ప్రాధాన్యం ఇస్తాయని, జాతి వివక్ష ఆస్కార్‌కూ తప్పలేదనే వాదనలు ఉన్నాయి.

అలాగే, మన దేశంలో కమల హాసన్ ఆస్కార్ గురించి మాట్లాడుతూ, అది ప్రపంచస్థాయి అవార్డు కాదని, దాని కోసం మనం వెంపర్లాడక్కర్లేదని అన్నారు.

భారతదేశం నుంచి కమల్ హాసన్ సినిమాలు అనేకసార్లు ఆస్కార్ అవార్డుల పోటీకి వెళ్లాయి. ‘నాయకుడు’, ‘కురుథిపునల్’, ‘భారతీయుడు’, ‘క్షత్రియ పుత్రుడు’, ‘హే రామ్’, ‘సాగర్ (హిందీ), ‘సాతి ముత్యం’.. మొత్తం ఏడు సినిమాలు భారత్ నుంచి అకాడమీ అవార్డుల పోటీకి వెళ్లాయి.

‘భారతదేశం గర్వించదగ్గ నటుడైన కమల హాసన్‌కు ఆస్కార్ అవార్డు ఎందుకు రాలేదన్న’ ప్రశ్న అప్పుడప్పుడూ చర్చల్లోకి వస్తుంటుంది.

దీనిపై కమల్ హాసన్ పలుమార్లు స్పందించారు.

“కమల్ హాసన్ గోల్ ఆస్కార్ అవార్డు అని అందరూ అనుకుంటారు. నేనెందుకు ఆసార్క్ వెంటపడతాను? నేను హాలీవుడ్ సినిమాల్లో నటిస్తే అప్పుడు అది నా గోల్ అవుతుంది. ఎందుకంటే తెలుగు సినిమాల్లో చేస్తే ఆస్కార్ ఇవ్వరు. ఆస్కార్ అనేది ప్రపంచ స్థాయి (వరల్డ్ స్టాండర్డ్) అవార్డు కాదు. అది ఒలింపిక్స్‌లా కాదు. అందరూ అనుకున్నట్టు అది వరల్డ్ స్టాండర్డ్ కాదు. అది కేవలం అమెరికన్ స్టాండర్డ్ సినిమాలకు ఇచ్చే అవార్డు. అక్కడ తీసే సినిమాలకు అది ముద్ర. నా ముఖం మీద ISI ముద్ర (ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్‌స్టిట్యూషన్ – భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తులకు ఇచ్చే ప్రామాణిక గుర్తింపు) ఉండాలి. అది నా గోల్” అని 2015లో ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.

అలాగే, 2018లో ఓ తమిళ ఛానెల్‌తో మాట్లాడుతూ, “క్రిస్టోఫర్ నోలన్ పేరు హాలీవుడ్ ఆఫ్ కమల్ హాసన్ అవ్వాలి. శివాజీ గణేశన్‌ని దక్షిణాసియా (మార్లిన్) బ్రాండో అనకూడదు. బ్రాండోని పశ్చిమదేశాల శివాజీ అనాలి. ఆ స్థాయికి మనం ఎదగాలి. మనం ఆస్కార్ కోసం వెంపర్లాడకూడదు. మన దేశంలో ఇచ్చే అవార్డు వాళ్లు తీసుకోవాలి. ఇది నేను చాలాసార్లు చెప్పిన విషయమే. ఇది మనం చేయగలం. మనం ప్రపంచానికి ఒక రాజకీయ దృక్పథాన్ని ఇవ్వగలం. కళను వైవిధ్యంగా అందించగలం. అందుకే ఈరోజు నేను సినిమా డైరెక్షన్‌లోకి వచ్చాను” అని అన్నారు.

ఇప్పటివరకు భారతదేశం నుంచి ఒక్క సినిమాకు కూడా ఆస్కార్ అవార్డు రాలేదు. అయితే, ఇప్పటికి వరకు అయిదుగురు భారతీయులకు ఆస్కార్ అవార్డు లభించింది.

ఆస్కార్ అవార్డుల వేడుకకు భారతదేశం నుంచి సెలబ్రిటీలకు ఆహ్వానం అందుతుంటుంది. 1987లో ఆస్కార్‌కు ఆహ్వానం అందుకున్న మొట్టమొదటి దక్షిణ భారత భాషా చలనచిత్ర నటుడు చిరంజీవి.

తాజాగా, 2022 అవార్డుల వేడుకకు తమిళ నటుడు సూర్య, హిందీ నటి కాజోల్ ఆహ్వానం అందుకున్నారు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)