Crime News: వ్యభిచారం చేయించి హత్య చేస్తారు.. కామారెడ్డి జిల్లాలో దంపతుల ఘాతుకం..

కొందరు కష్టపడి డబ్బు సంపాదించలేక పెడదారులు పడతారు. అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించి ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఈ క్రమంలో ఎలాంటి నేరాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇలా విలాసాలకు అలవాటు పడిన ఓ భార్యాభర్తల జంట వ్యభిచారం, దొంగతనం చేసేది. ఆ తర్వాత వారు హత్యలు కూడా చేశారు. చివరికి పోలీసులకు చిక్కారు.

వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన వీరమల్లు రమేశ్‌, యశోద భార్యాభర్తలు. వీరు తాగుడుకు బానిసలైయ్యారు. తాగడానికి డబ్బులు లేక దొంగతనాలు చేసేవారు.సెల్‌ఫోన్లు, ఆభరణాలు, నగదు దొంగిలించేవారు. ఈ క్రమంలో ఓ పెళ్లి మండపంలో దొంగతనం చేస్తుండగా దొరికిపోయిన వీరిని పోలీసులు కేసు నమోదు చేశారు.

బయటకు వచ్చిన తర్వాత రూట్ మార్చారు. కామారెడ్డిలో నివాసం ఉంటూ పలువురు మహిళలతో వ్యభిచారం చేయించారు. కొద్ది రోజుల తర్వాత వారిలో అత్యాశ పెరిగి హత్యలు చేశారు. మెదక్‌ జిల్లా రామాయంపేటకు చెందిన నరేష్‌ సాయంతో జులై 5న ప్రమీల అనే మహిళను కామారెడ్డికి రంపించారు. ఆమెతో వ్యభిచారం చేయించారు. ఆమెకు డబ్బులు రాగానే మద్యం తాగించి మత్తులో ఉండగా ఆమె గొంతు నులిమి చంపేశారు.

ప్రమీల వద్ద ఉన్న రూ.30 వేల నగదు, బంగారం, వెండి ఆభరణాలను తీసుకున్నారు. మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి కారులో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోలుతో కాల్చారు. సెప్టెంబర్ 7న వాణి అనే మహిళను ఇదే విధంగా పిలిపించి మర్డర్ చేశారు. మృతదేహాన్ని కారులో గాంధారి మండలం లిమ్మాపూర్‌ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చేశారు.

ఓ కేసులో విచారణలో భాగంగా పోలీసులు సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తుండగా.. ఓ కారు అనుమానాస్పదంగా కనిపించింది. కారు నెంబర్ ఆధారంగా వీరమల్లు రమేశ్‌ను పట్టుకొని విచారించారు. దీంతో హత్యలు వెలుగులోకి వచ్చాయి. దీంతో భార్య యశోద, వారి వద్ద కొనుగోలు చేసిన పిన్నోజి రామును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడైన నరేష్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది.