హైదరాబాద్ మ్యాచ్ కు టికెట్లు రెడీ – నేడే అమ్మకాలు: కండీషన్స్ అప్లై..!!

హైదరాబాద్ వేదికగా ఈ నెల 25న భారత్ – ఆస్ట్రేలియా మధ్య టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి కొద్ది రోజులుగా టిక్కెట్ల కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. సమయం దగ్గర పడినా ఇంకా టికెట్లు అందుబాటులోకి రాలేదు. దీని పైన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆన్ లైన్ లో అదే విధంగా ఆఫ్ లైన్ లో టికెట్లు విక్రయిస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చెప్పుకొచ్చింది. దీంతో..పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు అటు ఆన్ లైన్ లో ప్రయత్నాలు చేసారు. కానీ, దొరకలేదు.

దీంతో.. జింఖానా వద్ద టికెట్లు ఆఫ్ లైన్ లో విక్రయిస్తారనే సమాచారం అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. కానీ టికెట్లు అమ్మకాలు ప్రారంభం కావటంతో వారంతా ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారం పైన సీరియస్ అయింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు హెచ్చరిక చేసింది. టికెట్ల అమ్మకాల పైన ఆరా తీసింది. దీంతో..టీ20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు గురువారం నుంచి మొదలుకానున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.

గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంఖానా గ్రౌండ్‌లో టికెట్ల అమ్మకాలకు కౌంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రతినిధులు తెలిపారు. ఒక వ్యక్తికి రెండు టికెట్లు మాత్రమే విక్రయించడం జరుగుతుందని, టికెట్లు కొనేవారికి ఆధార్‌ కార్డు తప్పనిసరి అని హెచ్‌సీఏ స్పష్టం చేసింది. సెప్టెంబర్ 25న ఉప్పల్‌లో ఇండియా-ఆస్ట్రేలియా టీ20 ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టికెట్ల అమ్మకాల పైన సమాచారం ఇవ్వటంటో విఫలమైంది. దీంతో, బుధవారం ఉదయం నుంచే వివిధ జిల్లాల నుంచి క్రికెట్‌ అభిమానుల తెల్లవారు జాము నుంచే గ్రౌండ్‌ వద్ద బారులు తీరారు.

సెక్యూరిటీ సిబ్బంది గేట్లకు తాళాలు వేయడంతో గోడ దూకి లోపలికి దూసుకెళ్లారు. సెక్యూరిటీ గార్డులు లాఠీలకు పని చెప్పడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ చెల్లాచెదురై బయటికి పరుగులు తీశారు. దీంతో లంబా టాకీస్‌ రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. హెచ్‌సీఏకు, అజారుద్దీన్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టికెట్ల కోసం ఈ నెల 14 నుంచి తిరుగుతున్నామని, ఎప్పుడు ఇస్తారో స్పష్టంగా చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు అసోషియేషన్ నుంచి వచ్చిన ప్రకటనతో ఈ రోజున టికెట్లు అమ్మకాలు కొనసాగున్నాయి.