హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు: విరుచుకుపడిన భద్రతా బలగాలు, 31 మంది మృతి

టెహ్రాన్: ఇరాన్‌లో హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు నైతికత పేరుతో పోలీసులు అరెస్టు చేసిన మహ్సా అమినీ మరణం తర్వాత చెలరేగిన నిరసనలు మిన్నంటున్నాయి. అయితే, ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాయి భద్రతా బలగాలు. ఇరాన్‌లో భద్రతా బలగాలు జరిపిన అణిచివేతలో కనీసం 31 మంది పౌరులు మరణించారని వార్తా సంస్థ ఏఎఫ్‌పీ ఓస్లో నివేదించింది.

“ఇరాన్ ప్రజలు తమ ప్రాథమిక హక్కులు, మానవ గౌరవాన్ని సాధించుకోవడానికి వీధుల్లోకి వచ్చారు… ప్రభుత్వం వారి శాంతియుత నిరసనకు బుల్లెట్లతో ప్రతిస్పందిస్తోంది” అని ఓస్లోకు చెందిన ఇరాన్ మానవ హక్కుల స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ మహమూద్ అమీరీ-మొగద్దమ్‌ పేర్కొన్నారు.

దేశంలో హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇరాన్ గత వారం రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తోంది. సెప్టెంబర్ 16న 22 ఏళ్ల మహసా అమిని మరణం తరువాత ఆందోళన హింసాత్మకంగా మారింది.

హిజాబ్ నిబంధనలను పాటించనందుకు నైతికత పోలీసులు ఆమెను అరెస్టు చేసినప్పుడు.. అమినీ తన సోదరుడితో కలిసి టెహ్రాన్‌లో ఉన్నారు. ఆమె తలపై బలమైన దెబ్బ తగిలిన కొద్దిసేపటికే ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. ఆ తరువాత ఆసుపత్రిలో మరణించింది.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉధృతమైన నిరసనలను అరికట్టడానికి.. ఇరాన్ గురువారం టెహ్రాన్, కుర్దిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను బ్లాక్ చేసింది.

సోమవారం సాయంత్రం నుంచి ఇరాన్ పశ్చిమ కుర్దిస్తాన్ ప్రావిన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో ఇంటర్నెట్ సదుపాయానికి దాదాపు అంతరాయం ఏర్పడింది. సనందాజ్, టెహ్రాన్‌తో సహా దేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రాంతీయ బ్లాక్‌అవుట్‌లు ఉన్నాయి.

వీధి ర్యాలీలు 15 నగరాలకు వ్యాపించాయి. 1,000 మంది నిరసనకారుల గుంపులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి అరెస్టులు చేయవలసి వచ్చింది. ప్రదర్శనకారులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వారు, పోలీసు వాహనాలు, డబ్బాలను తగులబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఇరాన్ మీడియా వెల్లడించింది.