సీఎం జగన్ నిర్ణయం – నందమూరి కుటుంబం ఏమంటోంది..!!

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజీకయ వివాదంగా మారుతోంది. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ’ పేరు మార్చుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించింది. ఈ నిర్ణయం పైన రాష్ట్ర వ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్సార్ పేరు చేర్చటం పైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ నేతలు – పార్టీ శ్రేణులు దీని పైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.సభలో ముఖ్యమంత్రి జగన్ తాము ఈ పేరు మార్పు నిర్ణయానికి గల కారణాలను వివరించారు.

రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతున్నాయని, అవన్నీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయని వివరించారు. నాడు డాక్టర్ గా..సీఎంగా పేదలకు వైద్య సంస్కరణలు అందించిన వ్యక్తిగా వైఎస్సార్ కు ఆ క్రెడిట్ ఇవ్వటం సుముచితమని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ అంటే తనకు గౌరమవని చెప్పారు. అందుకే పాదయాత్రలో ఎవరూ అడగకపోయినా విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని హామీ ఇచ్చానని..అధికారంలోకి వచ్చిన తరువాత నిలబెట్టుకున్నానని సీఎం వివరించారు. ఇక, దీని పైన టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం నిర్ణయాన్ని తప్పుబట్టారు. అసలు హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇదే సమయంలో.. నందమూరి కుటుంబం స్పందించింది.

ఏపీ ప్రభుత్వ నిర్ణయం పైన నందమూరి రామకృష్ణ పేరుతో నందమూరి కుటుంబం ప్రెస్ నోట్ విడుదల చేసింది. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నామని ప్రెస్‌ నోట్‌లో ఎన్టీఆర్ కుటుంబం పేర్కొంది. హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని, 1986లో ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీని స్థాపించారని నందమూరి కుటుంబం గుర్తుచేసింది. నాడు ప్రజలు, పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారని.. అప్పటి సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టారని తెలిపింది. నందమూరి కుటుంబం గతంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబు తన సతీమణి పైన వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ సభను బహిష్కరించటం..ఆ తరువాత మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమవటంతో నాడు నందమూరి కుటుంబం మీడియా ముందుకు వచ్చింది.

వైసీపీ నేతలను హెచ్చరిస్తూ నందమూరి కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఇప్పటికే దగ్గుబాటి పురందేశ్వరి ఈ నిర్ణయాన్ని తప్పు బట్టారు. ఎన్టీఆర్ పైన గౌరవం ఉందంటూనే ఈ నిర్ణయాలు ఏంటని ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ పేరు మార్పు ద్వారా సాధించేదేంటని నిలదీసారు. బీజేపీ ..వామపక్షాల నేతలు ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయం సరి కాదని చెప్పుకొచ్చారు. అటు ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితుడైన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రభుత్వం తనకు అప్పగించిన అధికార భాషా సంఘం ఛైర్మన్ పదవికి రాజీనామా చేసారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి దగ్గరైన వల్లభనేని వంశీ ఈ పేరు మార్పు నిర్ణయం మరోసారి పరిశీలించాలని కోరారు. టీడీపీ నేతలు తాము అధికారంలోకి రాగానే తిరిగి హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసుకొస్తామని చెబుతున్నారు.