వ్యవసాయం ప్రైవేట్ పరమా, కేంద్రంపై కేటీఆర్ కస్సు బుస్సు

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం దుమ్మెత్తి పోస్తోంది. వివిధ అంశాలపై వ్యతిరేకిస్తూ.. విమర్శలు చేస్తోంది. మంత్రులు ముప్పేట దాడికి దిగుతున్నారు. ప్రతీగా బీజేపీ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. తాజాగా మంత్రి కేటీఆర్ స్పందించారు. వ్యవసాయ రంగం కూడా ప్రైవేట్ పరం చేస్తామని కేంద్రం ప్రకటనపై కేటీఆర్ గుస్సా అయ్యారు.

దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేస్తామని ప్రకటన చేయడం దారుణం అని కేటీఆర్ అన్నారు. ధాన్యం సేకరణ వల్ల నష్టం వస్తోందని పేర్కొన్నారు. అందుకే దానిని ప్రైవేటుపరం చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సుధాంషు పాండే ప్రకటన చేశారని మండిపడ్డారు. ఇదీ సరికాదని, తీరు మార్చుకోవాలని కోరారు. అన్నం పెట్టే వ్యవసాయాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తామని అనడం ఎంతవరకు సమంజసం అని అడిగారు.

అలాగే కేంద్రం ప్రతిపాదిస్తున్న విద్యుత్ సంస్కరణలు గురించి కూడా కేటీఆర్ ప్రస్తావించారు. వాటిని అమలు చేస్తే ఇక రైతులకు ఉచిత విద్యుత్ అనేదే దక్కదన్నారు. రైతులకు ఇస్తున్న రాయితీ ఎత్తివేసేందుకే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను ముందుకు తెస్తోందని ఆరోపించారు. విద్యుత్ సంస్కరణలు అమల్లోకి వస్తే నష్టపోయేది తెలంగాణ రైతాంగమేనని పేర్కొన్నారు. సంస్కరణలు అమలు అయితే రైతులకు ఉచిత విద్యుత్ ఉండదని తెలిపారు. తమ పొలంలోనే రైతులు కూలీలుగా మారిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఎఫ్ఆర్‌బీఎం, ఇతర నిధుల గురించి కూడా మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల గురించి పట్టించుకోరని ఫైరయ్యారు. పైగా అదీ చేస్తాం.. ఇదీ చేస్తాం అని ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు.