వైఎస్ జగన్ కు పురందేశ్వరి కౌంటర్

దివంగత ఎన్టీఆర్‌పై గౌరవం ఉందని చెబుతూనే ఆయన పేరుమీద ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని భారతీయ జనతాపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అన్నారు. అందరూ వైద్యులతై ఎన్టీఆర్‌ సామాజిక వైద్యుడని ఆమె అభివర్ణించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలు పేర్లు మార్చుకున్నాయని, వాస్తావనికి అవన్నీ ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలేనని చెప్పారు. కారణం లేకుండా పేరు మార్చడమనేది ఎన్టీఆర్‌కు జరిగిన అవమానమేనన్నారు.

వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాలపై తమ పార్టీ నిరంతరం ప్రజా పోరాటాలు చేయడానికి సిద్ధమైందన్నారు. ఏపీలో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం లేదని, పెట్టుబడులకు అవసరమైన వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఏ ప్రభుత్వంపైనా లేనన్ని కేసులు ఏపీ ప్రభుత్వంపై ఉన్నాయని, హామీ ఇచ్చినా రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేయలేదని ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్ పేరుమీద ఉన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ప్రస్తుత ప్రభుత్వం డాక్టర్ వైఎస్ఆర్ పేరు పెట్టింది. దీనిపై ప్రతిపక్షాలన్నీ నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, పీడీఎఫ్ తోపాటు వామపక్షాలు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా ఖండించారు. తెలుగుదేశం పార్టీ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. వైద్యుడిగా ఆ యూనివర్సిటీకి వైఎస్ పేరే సరైందని సీఎం జగన్ స్పష్టం చేశారు.