వివేక్‌కు కీలక బాధ్యత, స్టీరింగ్ కమిటీ ఏర్పాటు, సభ్యులు వీరే, ఈటలకు ఛాన్స్

మునుగోడు బై పోల్‌ విజయం బీజేపీకి తప్పనిసరి అయ్యింది. ఆ మేరకు ఆ పార్టీ వ్యుహారచన చేస్తోంది. జనాల్లోకి వెళ్లి.. ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ మేరకు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. కీలక నేత వివేక్‌కు చైర్మన్ బాధ్యతలను అప్పగించింది. మిగతా వారికి సభ్యులుగా నియమించింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వివరాలను తెలియజేశారు.

కో ఆర్డినేటర్‌గా మనోహర్ రెడ్డి ఉంటారు. 14 మంది సభ్యులను నియమించారు. సభ్యుల్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు చోటు లభించింది. మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్, విజయశాంతి, రవీంద్ర నాయక్, రాపోల్ ఆనంద భాస్కర్, మాజీమంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, కపిలవాయి దిలీప్ కుమార్, ఆచారి, దాసోజు శ్రవణ్ కుమార్ ఉన్నారు.

బీజేపీలో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండగా ఒక్క ఈటల రాజేందర్‌కు మాత్రమే అవకాశం లభించింది. స్టీరింగ్ కమిటీ బై పోల్ క్యాంపెయిన్, వ్యుహారచన చేయనుంది. ఎటు చేసి ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. విజయం కోసం క్షేత్రస్థాయిలో నేతలు, శ్రేణులు కలిసికట్టుగా పనిచేయబోతున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పదవీకి కూడా రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆయన బీజేపీలో చేరగా.. విజయం కోసం ఆ పార్టీ శ్రమిస్తోంది. మునుగోడులో గెలిస్తే.. రాష్ట్రంలో బీజేపీ అధికారం ఖాయం అని అంటోంది. ఆ మేరకు ప్రచారం చేస్తోంది.