విద్వేషాన్ని అడ్డుకోండి-మౌనసాక్షిగా మిలిగిపోవద్దు-కేంద్రానికి సుప్రీంకోర్టు అక్షింతలు

దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్న విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేసే విషయంలో కేంద్రం మౌనంగా ఉండిపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు విద్వేష ప్రసంగాలపై చర్యలు కోరుతూ దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్రం తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

విద్వేష ప్రసంగాలు భారత దేశ సామాజిక సమతౌల్యాన్ని దెబ్బతీసే విషం లాంటివని, దేశంలో మత సామరస్యాన్ని పణంగా పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే వారికి ఇవి ఉపయోగపడుతున్నాయని సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టాలు వీటికి అడ్డుకట్ట వేసేలా లేవని, లా కమిషన్ సిఫార్సుల మేరకు విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చట్టాల్ని తీసుకురావాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంత తీవ్రమైన సమస్యను పరిష్కరించే విషయంలో మౌనమునిలా ఉండిపోవద్దని కేంద్రానికి జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ హృషికేష్ రాయ్ తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం అక్షింతలు వేసింది. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దని సూచించింది.

కేంద్రం విద్వేష ప్రసంగాల విషయంలో తగిన చర్యలుతీసుకోవడంలో విఫలమైతే తామే గతంలో పనిచేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపులకు సంబంధించిన విశాఖ కేసు తరహాలోనే న్యాయపరమైన చర్యలు ప్రకటిస్తామని హెచ్చరించింది. ముఖ్యంగా టీవీ ఛానళ్లలో విచ్చలవిడిగా సాగుతున్న విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్టవేయగలరా లేదా అని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. అందులోనూ యాంకర్లు చేస్తున్న విద్వేష వ్యాఖ్యలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. విద్వేష వ్యాప్తితో టీఆర్పీలు తెచ్చుకునేందుకు తాము అనుమతించబోమని తెలిపింది.

అలాగే ప్రజలు కూడా ఏమతం కూడా విద్వేషాన్ని బోధించదని, అందరూ ఈ దేశ ప్రజలేనని, ఇక్కడ విద్వేషానికి ఎలాంటి చోటు లేదని తెలుసుకోవాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఉన్న చట్టాల్లో విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి సెక్షన్లూ లేకపోవడంతో పోలీసులు కూడా కేవలం సమూహాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న సెక్షన్ల కిందే కేసులు నమోదుచేస్తున్నట్లు సుప్రీంకోర్టు గుర్తించింది. దీనిపై తగు చర్యలు ప్రకటించేందుకు కేంద్రానికి రెండు వారాల గడువిస్తూ విచారణను వాయిదా వేసింది.