రోజా సవాల్ కు జనసేన ప్రతిసవాల్.. జనసేన నేతల హౌస్ అరెస్ట్; నగరిలో రచ్చ!!

పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా చేసిన సంచలన వ్యాఖ్యలు నేపథ్యంలో నగరి నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి. పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రోజాకు జనసేన నేతలు సవాల్ విసురుతున్నారు. నగరి నియోజకవర్గంలో అభివృద్ధి పై చర్చకు రావాలని మంత్రి రోజాకు ఛాలెంజ్ చేస్తున్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆర్.కె.రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముందు సర్పంచ్ గా గెలిచిన తరువాత ఎమ్మెల్యే కాగలరని జనసేన పార్టీని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు లేరని పేర్కొన్న మంత్రి రోజా పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయగలరా అంటూ సవాల్ విసిరారు. జగన్ పై పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శలపై మండిపడిన రోజా 45 సీట్లు వైసీపీకి వస్తే, 135 సీట్లు జనసేనకు వస్తాయా అంటూ నిలదీశారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ జాతకం చెబుతుంటే నవ్వొస్తుంది అంటూ రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రోజా వ్యాఖ్యలకు జనసేన నేతలు కౌంటర్ వేస్తున్నారు.

ముందు నగరి నియోజకవర్గాన్ని చూసుకోమని, వచ్చే ఎన్నికలలో గెలిచి చూపించమని రోజా కు ప్రతి సవాల్ విసిరారు. నగరి నియోజకవర్గ అభివృద్ధి పై చర్చకు సిద్ధమా అంటూ మంత్రి రోజా ను ప్రశ్నించారు. త్వరలో నీ సీట్ గల్లంతు అవుతుందని, మా గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది అంటూ రోజా వ్యాఖ్యలపై విరుచుకుపడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పై సమీక్ష పెట్టమంటే రోజా ఎందుకు వెనకడుగు వేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ నగరిలో రోజా శకం ముగిసింది అంటూ మండిపడ్డారు.

ఇక దీంతో మరోమారు జనసేన నేతలపై మండిపడిన రోజా నగరి నియోజకవర్గంలో ఎలా అభివృద్ధి జరిగిందో ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యలు చేశారు. నగరిలో అభివృద్ధి జరగలేదని మాట్లాడేవారు దమ్ముంటే తన ఇంటికి రావాలంటూ చాలెంజ్ చేశారు. ఇక జెండా విలువలు లేని వ్యక్తి వెనుక జనసేన కార్యకర్తలు ఉన్నారని, వారంతా సిగ్గుతో తలదించుకోవాలి అని రోజా మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీంతో మంత్రి రోజా సవాలును స్వీకరించి నగిరికి వెళ్లడానికి ప్రయత్నం చేసిన జనసేన నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్టులపై మండిపడుతున్న జనసేన నేతలు తమకు సమాధానం చెప్పలేక, పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నారని రోజా పై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ మాట అటుంచి నగరిలో మళ్లీ రోజా గెలిచి చూపించాలని టిడిపి, జనసేన నేతలు సవాల్ చేస్తున్నారు. దీంతో నగరిలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది.