మెట్రో మరో ఆఫర్.. రాత్రి 12.30 గంటల వరకు సర్వీస్, మ్యాచ్ సందర్బంగా..

ఏదైనా ఈవెంట్.. లేదంటే పండగ అయితే హైదరాబాద్ మెట్రో ఆఫర్ ఇస్తోంది. ఇటీవల గణేశ్ నిమజ్జనం సందర్భంగా అర్ధరాత్రి వరకు మెట్రో సర్వీస్ చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా 4 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానం చేర్చింది. ఇప్పుడు మరో వేడుక వచ్చింది. అదే.. ఆదివారం ఉప్పల్‌లో టీ20 మ్యాచ్.. మ్యాచ్ సందర్భంగా రాత్రి 12.30 గంటల వరకు మెట్రో సర్వీస్ అందుబాటులో ఉండనుంది. సో.. మ్యాచ్ చూసి తిరిగి ఇంటికి వచ్చేందుకు మెట్రో ఆఫర్ చేసింది.

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ ప్రత్యక్షంగా చూసేందుకు సిటీలోని క్రికెట్ ఫ్యాన్స్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గురువారం జింఖానా గ్రౌండ్స్ లో టికెట్ల కోసం తొక్కిసలాట కూడా జరిగిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ జరిగే 25వ తేదీన క్రికెట్ ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ మెట్రో రైల్ గుడ్ న్యూస్ తెలిపింది. మ్యాచ్ ముగిసేసరికి రాత్రి 10 గంటలు దాటనుంది. అప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ నిశ్చింతగా ఇళ్లకు వెళ్లేందుకు సిటీలో మెట్రో సర్వీస్ చేయనుంది. ఆ రోజు రాత్రి 12.30 గంటల దాకా మెట్రో రైళ్లను నడిపిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రద్దీని బట్టి రైళ్ల సంఖ్యను పెంచే విషయంపై ఆలోచిస్తామని తెలిపారు. సో ఇదీ నిజంగా గుడ్ న్యూస్.. మెట్రో ఎక్కి.. ఎంచక్కా ఇళ్లలోకి చేరుకునే అవకాశం ఉంది.

నిమజ్జనం సందర్భంగా అర్ధరాత్రి 2 గంటల వరకు సర్వీసు చేసింది. ఆ రోజు భారీగా జనం వచ్చి.. కొత్త రికార్డును నెల‌కొల్పింది. గ‌ణేశ్ శోభాయాత్ర సంద‌ర్భంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు హుస్సేన్ సాగ‌ర్‌కు వ‌చ్చారు. భ‌క్తుల కోసం అర్థ‌రాత్రి దాకా మెట్రో సేవ‌లు న‌డిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఒకే రోజు అత్య‌ధిక సంఖ్య‌లో జ‌నం ప్ర‌యాణించిన విష‌యంలో హైద‌రాబాద్ మెట్రో రికార్డుల‌ను న‌మోదు చేసింది. ఒక్క‌రోజే హైద‌రాబాద్ మెట్రోలో ఏకంగా 4 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించారు. మరీ ఇప్పుడు ఏ స్థాయిలో ట్రావెల్ చేయనున్నారో చూడాలీ మరీ.