మునుగోడులో బీజేపీ తరపున మరో ఆర్ గెలవడం ఖాయం: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ నేతల సభలకు డబ్బులిచ్చి జనాలను తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు.

ఏం ఘనకార్యం చేశావని దేశ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలనుకుంటున్నావ్ అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. బీజేపీ తరపున మరో ‘ఆర్’ గెలవడం ఖాయమని, గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.

ఫామ్‌హౌస్ నుంచి బయటకు రానీ కేసీఆర్.. బయటకు వచ్చి మునుగోడులో సభ పెట్టిండు అంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే.. టీఆర్ఎస్ లాగా లక్షల కోట్లు దోచుకున్న పార్టీ కాదని అన్నారు. మచ్చలేని నాయకుడు మోడీ అని చెప్పారు.

మునుగోడు ఎన్నికలపై కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. కాంగ్రెస్ చివరకు తమ అభ్యర్థిని ప్రకటించినా.. కేసీఆర్ మాత్రం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సభలు కూడా జనం లేక వెలవెలబోతున్నాయన్నారు.

ప్రాజెక్టుల పేరుతో కోట్లు దండుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నిక ఒక వ్యక్తి కోసం వచ్చిన ఉపఎన్నిక కాదన్నారు. ప్రజల సంక్షేమం కోసం, భవిష్యత్ కోసం వచ్చిన ఉపఎన్నిక అని చెప్పుకొచ్చారు. మునుగోడులో జరిగేది ఎన్నిక కాదని.. అది ఒక ధర్మ యుద్ధమన్నారు.