మహీంద్ర ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లను నియమించుకోవద్దు: ఆర్బీఐ, మహిళ మృతి ఎఫెక్ట్

న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌ను అవుట్‌సోర్సింగ్ ఏజెంట్ల ద్వారా రికవరీ చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గురువారం ఆదేశించింది. ఫైనాన్స్ కంపెనీ బయటి రికవరీ ఏజెంట్లను ఇకపై ఉపయోగించరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది.

జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో ఫైనాన్స్ కంపెనీకి చెందిన రికవరీ ఏజెంట్.. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని వెళుతుండగా.. ట్రాక్టర్ చక్రాల కింద పడి ఓ గర్భిణీ స్త్రీ మరణించిన తర్వాత ఆర్బీఐ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ట్రాక్టర్ రికవరీ కోసం బాధితుడి నివాసానికి వెళ్లే ముందు ఫైనాన్స్ కంపెనీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వలేదని హజారీబాగ్ స్థానిక పోలీసులు మీడియాకు తెలిపారు.

‘మేము ఈ సంఘటనను అన్ని కోణాల నుంచి పరిశోధిస్తాము. మూడవ పక్ష సేకరణ ఏజెన్సీలను ఉపయోగించే పద్ధతిని కూడా పరిశీలిస్తాము. ఈ విషాద సమయంలో మేము కుటుంబానికి అండగా ఉంటాము’ అని మహీంద్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ అనీష్ షా ఈ సంఘటనపై ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.