మందు కొట్టడం మానేసిన ముఖ్యమంత్రి?

ఆప్ పార్టీకి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అతిగా మద్యం సేవించి విమానం ఎక్కారని, సిబ్బంది ఆయన్ను బలవంతంగా దింపేశారంటూ వార్తలు వచ్చాయి. దీనివల్లే లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం జర్మనీ నుంచి నలుగు గంటలు ఆలస్యంగా నడిచిందంటూ వచ్చిన వార్తా కథనాన్ని అకాలీదళ్ ట్విటర్ లో పోస్ట్ చేయగా, మరో పార్టీ కాంగ్రెస్ కూడా ఆ కథనాన్ని పోస్ట్ చేసింది. దీన్ని ఆప్ ఖండించింది.

తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మాన్ పెట్టబడులతో పంజాబ్ వచ్చారని, కేవలం ఆయన అనారోగ్యంవల్లే విమానం ఆలస్యమైందని, కావాలంటే ఎయిర్ లైన్స్ దగ్గర చెక్ చేసుకోమని చెప్పింది. దీనిపై లుఫ్తాన్సా ఇంతవరకు స్పందించలేదు. ప్రయాణికుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పింది.

ఈ తరుణంలోనే భగవంత్ మాన్ 2019లో భారీ సభ నిర్వహించినప్పుడు మద్యం మానేసినట్లుగా చెప్పిన వీడియో వైరలవుతోంది. ఆ సభలో ఉన్న మాన్ తాను ఎప్పుడో ఒకసారి మాత్రమే అరుదుగా మద్యం తీసుకునేవాడినని, కానీ తనపై అనవసంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వాపోయారు. తనను కించపరిచేలా ఉన్న వీడియోలు చూస్తే బాధ కలుగుతుందన్నారు.

అతిగా మద్యం సేవించారంటూ వస్తున్న ఆరోపణలు చూసి నా తల్లి మద్యపానం మానేయాలని సూచించారు. నేను ఆ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. అదే సభలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఈ సందర్భంగా మాన్ ను ప్రశంసలతో ముంచెత్తారు. ప్రజల కోసం త్యాగం చేసినవారే నిజమైన నాయకులవుతారని, మద్యపానం మానేయడం సామాన్యమైన విషయమేం కాదని కొనియాడారు.