బండి సంజయ్ నాలుగోవిడత పాదయాత్ర ముగింపు సభ నేడే.. హాజరుకానున్న కేంద్ర సహాయమంత్రి సాధ్వి!!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ సాగిస్తున్న ప్రజా సంగ్రామ పాదయాత్ర నాలుగో విడత నేడు ముగింపుకు చేరుకుంది. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు పెద్ద అంబర్ పేట లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

నేడు జరుగనున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ప్రతిసారి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు బహిరంగసభకు కేంద్రమంత్రులను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే ఈ సారి సాధ్వి నిరంజన్ జ్యోతిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ తీరుపై, కెసిఆర్ కుటుంబ పాలనపై, అవినీతిపై కేంద్ర మంత్రులు వరుసగా నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరును, తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు.

ఇక ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా వస్తున్న సాధ్వి నిరంజన్ జ్యోతి ఏమి మాట్లాడతారు అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ నియోజకవర్గం నుంచి సాధ్వి నిరంజన్ జ్యోతి ఎంపీగా గెలిచారు. బీజేపీలో ఆమెకు మంచి పేరుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆమెకు కేంద్రమంత్రిగా అవకాశం ఇచ్చారు. మరి నేడు ఆమె తెలంగాణ రాష్ట్రంలో బిజెపి బహిరంగ సభలో మాట్లాడనున్న నేపథ్యంలో ఈ సభకు భారీగా జనసమీకరణ చేపట్టాలని నిర్ణయించిన బీజేపీ శ్రేణులు, పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో విడత 10 రోజుల పాటు సాగింది.బండి సంజయ్ పాదయాత్రలో 115.3 కిలోమీటర్ల మేర తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలమీదుగా పాదయాత్ర చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ను టార్గెట్ చేస్తూ సాగిన ఈ పాదయాత్రలో బండి సంజయ్ కుమార్ సేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్‌బీ నగర్,ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పాదయాత్రను కొనసాగించారు. ఇక నేడు చివరి రోజు పెద్ద అంబర్ పేట లో భారీ బహిరంగ సభలో పాదయాత్రను ముగించనున్నారు.

ఈ దఫా పాదయాత్రలో కూడా బండి సంజయ్ కెసిఆర్ కుటుంబం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఏ స్కాంలో చూసినా కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని, ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర ఉందంటూ, కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదంటూ టార్గెట్ చేశారు. రాష్ట్రంలో సీబీఐ, ఈడీ దాడులు చూసి కవిత కుటుంబం క్వారంటైన్ కి వెళ్లక తప్పదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎంఐఎం ఆగడాలకు బీజేపీ అడ్డుకట్ట వేయగలదని పేర్కొన్న బండి సంజయ్ రాష్ట్రంలోని తాజా అనేక పరిణామాలపై టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఇక నేడు జరగనున్న భారీ బహిరంగ సభలో బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారు? కేంద్ర సహాయ మంత్రి ఏం చెప్పబోతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.