ప్రజారోగ్యం కోసం తెలంగాణా ప్రభుత్వ మరో ముందడుగు: 12సెంట్రల్ మెడిసిన్ స్టోర్లు ఏర్పాటుకు ఆదేశాలు

ప్రజారోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి, ప్రజలకు అందుబాటులో ఔషధాలు అందించడానికి నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రోగుల ప్రాణాలను రక్షించే మందులు అందుబాటులో ఉండేలా, మందుల విషయంలో జాప్యం జరగకుండా చూసేందుకు, కొత్తగా 12 సెంట్రల్ మెడిసిన్ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఉండటం వల్ల తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేద రోగులకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఆసుపత్రులు మరియు వైద్య సేవలను మెరుగుపరచడం కోసం 12 చోట్ల సెంట్రల్ మెడిసిన్ స్టోర్ లను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువ కానుంది తెలంగాణ ప్రభుత్వం.

సిద్దిపేటలోని టీచింగ్‌ ఆస్పత్రి, వనపర్తి, మహబూబాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్‌, సూర్యాపేటలోని జిల్లా ఆసుపత్రులు, వికారాబాద్‌లోని ఏరియా ఆస్పత్రి, గద్వాల్‌లోని జిల్లా ఆస్పత్రులలో 12 కేంద్రీయ మందుల దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఈ సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ద్వారా ప్రజలకు అవసరమైన ఔషధాలను ప్రభుత్వం నేరుగా అందిస్తుందని చెప్తున్నారు.

సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్స్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌కు 3కోట్ల 60 లక్షల రూపాయల చొప్పున, మొత్తం 12 సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటుకు రూ.43.20 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడత ఈ సంవత్సరం 6 స్టోర్లను వచ్చే ఏడాది మరో ఆరు స్టోర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ స్టోర్లను నిర్వహించడానికి, మొత్తం 12 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 36 మంది ప్యాకర్లు మరియు 12 మంది వాచ్‌మెన్‌లు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఆర్థిక శాఖ సూచించిన వేతనంతో నియమించుకోవడానికి తెలంగాణ స్టేట్ మెడికల్ , శానిటేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అనుమతులు జారీ చేసింది.

స్టోర్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం కార్పొరేషన్ ను ఆదేశించింది. ఇక ఇదే సమయంలో ఆర్టీసీ, పోస్టల్ డిపార్ట్‌మెంట్ నుండి ఒక్కో ప్రదేశానికి ఒకటి చొప్పున 12 రవాణా వాహనాలను అద్దెకు తీసుకునేందుకు కూడా అధికారులు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాదుకు అనుబంధంగా ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే వారికి పూర్తి ఉచితంగా వైద్యం అందాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లాలి అన్న లక్ష్యంతో వైద్య ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.