పాతబస్తీని రాజకీయంగా అడ్డగా మార్చుకున్న ఎంఐఎం పార్టీ…

హైదరాబాద్‌ పాతబస్తీని రాజకీయంగా అడ్డగా మార్చుకున్న ఎంఐఎం పార్టీ… ఇప్పుడు పక్క జిల్లాలపై కూడా కన్నేస్తోంది. ఆ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో మజ్లిస్‌ పార్టీ ఉందట. దాంతో ఆ రెండు నియోజకవర్గల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎంఐఎం టెన్షన్‌ పట్టుకుందట. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం ఆ సీట్లు అడిగితే తమ పరిస్థితి ఏంటని ఆందోళనకు గురవుతున్న స్థానిక ఎమ్మెల్యేలకు కంటినిండా నిద్ర కారువైందట. ఇంతకీ ఆ జిల్లా ఏది?

ఎంఐఎం పార్టీ అంటే కేవలం తెలంగాణలోని హైదరాబాద్ పాత బస్తీకే పరిమితమయిన పార్టీగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో దేశంలోని ప్రధాన నగరాలతో పాటు ఉత్తర భారతంలో కూడా పోటీ చేసి ఎన్నికల్లో గెలిచింది. ఏదేమైనా హైదరాబాద్‌ పాతబస్తీని రాజకీయంగా అడ్డాగా మార్చుకున్నారు మజ్లీస్ నేతలు. ఇప్పుడు నిజామాబాద్‌ జిల్లాపై కన్నేశారంట ఆ పార్టీ నేతలు. నిజామాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో మజ్లిస్‌ పార్టీ ఉందట.

నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌లలో పోటీకి సిద్ధంగా ఉండాలని స్థానిక ఎంఐఏం కేడర్‌కు సంకేతాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాక ఆ రెండు చోట్లా పార్టీ కార్యక్రమాల జోరు పెంచాలని డిసైడ్‌ అయ్యారట. ఎంఐఏం పోటీ ఎలా ఉన్నా.. టీఆర్ఎస్‌తో ఆపార్టీకి ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్‌ అర్బన్‌, బోధన ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.

నిజమాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. 2004 ఎన్నికల్లో ఇక్కడ ఎంఐఎం అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు. మొన్నటి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 13 డివిజన్లలో గెలిస్తే..ఎంఐఏం 16 చోట్ల పాగా వేసింది.ఇక బోధన్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి ముస్లిం సామాజిక వర్గానికి చెందిన షకీల్ ఎమ్మెల్యేగా గెలిచారు. షకీల్‌ గెలుపులో ముస్లిం ఓట్లు కీలకంగా పని చేశాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మున్సిపల్‌ ఎన్నికల్లో 38 వార్డులకుగాను 11 చోట్ల ఎంఐఏం గాలి పటం సత్తా చాటింది. ఇలా రెండు నియోజకవర్గాల్లో మజ్లిస్‌ పార్టీ పట్టు సాధించడంతో.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారంట.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌లలో టీఆర్ఎస్‌కు సపోర్ట్‌ చేసిందని చెబుతారు. అందుకే అక్కడ టీఆర్ఎస్‌ అభ్యర్థులు ఈజీగా గెలిచారని .. ఇప్పుడు మజ్లిస్‌పార్టీ వైఖరి మార్చుకోవడంతో లెక్కలు మారిపోతాయని చర్చ సాగుతోందట. నిజామాబాద్‌ అర్బన్‌ సీటు కోసం ఎంఐఏంలో డిప్యూటీ మేయర్‌ ఇద్రీస్‌ ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే మీర్‌ మజాజ్‌ అలీ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట … బోధన్‌లోనూ గట్టి అభ్యర్థి కోసం వేట మొదలైనట్టు సమాచారం.

హైదరాబాద్‌ పాత బస్తీకే పరిమితం కాకూడదనే ఆలోచనలో మజ్లిస్‌ పార్టీ నేతలు ఉన్నారంటున్నారు. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలంగాణలో తమకు అనువైన ఈజీగా గెలిచే అసెంబ్లీ నియోజకవర్గాలపై కొంతకాలంగా కసర్తతు చేస్తున్నారట. దేశంలోని పలు ప్రాంతాలలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి.. కొన్నిచోట్ల గెలిచి ఎంఐఏం బలమైన శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తోందట. ఇప్పుడు తెలంగాణలోనూ అదే సూత్రం అమలు చేసే పనిలో పడింది. మరి వీరి ఆలోచనలకు అధికార పక్షం ఓకే చెబితే, అక్కడి సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు సీటు గల్లంతే.