నూతన సచివాలయం – మరో రెండు మెగా ప్రాజెక్టులు : ప్రారంభంపై కేటీఆర్ అప్​డేట్..!!

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం ఎప్పుడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న నూతన సచివాలయ ప్రారంభం పైన ప్రభుత్వంలో కసరత్తు జరుగుతోంది. పూర్తిగా సంప్రదాయం – ఆధునీకత మేళవించి వీటి నిర్మాణాలు చేపట్టారు. దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వీటి నిర్మాణాలను పరిశీలించారు. మార్పులకు సంబంధించి పలు కీలక సూచనలు చేసారు. చరిత్రలో నిలిచిపోయేలా నిర్మాణం చేస్తున్నామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.

ఇప్పుడు సచివాలయంతో పాటుగా హైదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్న మరో రెండు మెగా ప్రాజెక్టుల గురించి మంత్రి కేటీఆర్ ఒక అప్ డేట్ ఇచ్చారు. నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమవుతోందని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్​ సచివాలయాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. మరో రెండు మెగా ప్రాజెక్టుల గురించీ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ అమరవీరుల స్మారకం.. 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని ట్విటర్ వేదికగా కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే సచివాలయానికి భారతరత్న బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్ణయించారు.

ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. సచివాలయానికి అంబేద్కర్ నామకరణం..దేశానికి గర్వకారణంగా కేసీఆర్ పేర్కొన్నారు. ఇక, ఢిల్లీలో కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఎం కేసీఆర్ ఇదే అంశం పైన ప్రధానికి లేఖ రాయనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉండటంతో.. హైదరాబాద్ కేంద్రంగా ఈ ప్రతిష్ఠాత్మక నిర్మాణాలను పూర్తి చేసి..ప్రారంభించటంతో పాటుగా పాలనా పరంగానూ కీలక నిర్ణయాల దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వ అడుగులు వేస్తోంది. ఈ నిర్మాణాలు ప్రారంభం అయితే హైదరాబాద్ కు మరింత ఖ్యాతి పెరుగుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.