నవంబరు 1 నుంచి ఏపీలో నిషేధం

ఏపీ ప్రభుత్వం నవంబరు 1వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలను నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల దిగుమతికి, ఉత్పత్తికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఫ్లెక్సీల వినియోగం, ప్రదర్శన, ముద్రణ, రవాణా వంటివాటిపై నిషేధం విధించింది. నగరాలు, పట్టణాల్లో అధికారులు దీనికి బాధ్యత వహించాలని ఆదేశించింది.

గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉంచింది. నిబంధనను అతిక్రమించి ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే రూ.100 జరిమానా విధించనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు అతిక్రమించినవారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొంది. నిషేధాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులు, జీఎస్టీ అధికారులు, రవాణా శాఖ అధికారులపై పెట్టింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీ బదులుగా కాటన్ ఫ్లెక్సీలు, నేత వస్త్రాలు వాడాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో వెల్లడించింది.

ముఖ్యమంత్రి జగన్ ఇటీవల విశాఖపట్నంలోని బీచ్ లో వ్యర్థాలను వేరుచేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. విదేశీ సంస్థ సహకారంతో ప్రభుత్వం దీన్ని చేపట్టింది. అదేరోజు జగన్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం ఉంటుందని ప్రకటించారు. దానికి అనుగుణంగా తాజా ఉత్తర్వులు జారీచేసింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీల ప్రింటింగ్, ఏర్పాటు తదితరాలపై లక్షల సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు.