న‌గ‌రం న‌డ‌బొడ్డున చూడాల్సిన‌ ఆగ్రా అందాలు!

న‌గ‌రం న‌డ‌బొడ్డున చూడాల్సిన‌ ఆగ్రా అందాలు!

నిత్యం ఉద్యోగ జీవితంలోని ఒత్తిళ్ల నుంచి ఆటవిడుపుగా, హృదయాలకు ఉల్లాసాన్ని అందించాలి. అదే భావనతో మా మిత్ర‌బృందం విహారయాత్ర‌ల‌కు ప్లాన్ చేస్తూ ఉంటాం. ఈసారి అంద‌రం క‌లిసి హాయిగా ఆగ్రా అందాలను ఆస్వాదించేందుకు బయలుదేరాం. న్యూఢిల్లీ వెళ్ళేందుకు చాలా రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. మేమంతా విజ‌య‌వాడ నుంచి బయలుదేరిన 28 గంటల తర్వాత ఆగ్రా స్టేషన్ చేరాం.

ఆగ్రా న‌గ‌రం. రాజపుత్రుల చేతుల నుంచి మొఘల్ సామ్రాజ్య అధికారంలోకి మారి, బ్రిటిష్ వారి చేతికి చిక్కిన చారిత్రాత్మక నగరం. 11వ శతాబ్దం నుంచే భారతదేశ చరిత్రలో అరుదైన ఘట్టాలకు, యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచిన ప్రదేశం ఇది. దేశం నలుమూలల నుంచీ అంతరాష్ట్ర విమాన, రైళ్ళ, రోడ్డు ప్రయాణ సౌకర్యాలు కలిగిన ప్రాంతం. న్యూఢిల్లీ నుంచి హౌరా వెళ్లే నేషనల్ హైవే – 2 ఈ నగరం నడిబొడ్డు నుండే వెళుతుంది. ముందుగా ఆగ్రాకు 50 కిలోమీట‌ర్ల‌ దూరాన ఉన్న ‘మధుర” చేరాం. శూరసేన వంశస్థుడైన కంసుడు పాలనలో దేవకీ – వాసుదేవలు కారాగారవాసం అనుభవిస్తూ గర్భశోకాన్ని భరించిన ప్రాంతమని నానుడి. ఆలయ ప్రాంగణంలో పెద్దసరస్సు…. పాలతో చేసిన కుల్ఫీలు, కోవా, చాలా రుచిగా చవకగా దొరకుతాయి. “మధుర”లో విమానాశ్రయం లేదు కానీ అన్ని ప్రధాన రైళ్ళూ ఆగుతాయి. ఢిల్లీ వెళ్లే మార్గంలో ఉంటుంది.

  jaipurtoagra    

రాచ‌రిక‌పు క‌ట్ట‌డాల న‌గ‌రం..

ముందుగా, ఆగ్రా అనగానే అందరికీ సహజంగా గుర్చుకొచ్చేది తాజ్‌మ‌హల్. ఎటుచూసినా రాచరికపు కట్టడాలతో నగరం ఠీవిగా ఉంటుంది. 11వ శతాబ్దంలో బాదల్షాఘర్గా పిలవబడిన ఆగ్రా చరిత్ర చాలా సుదీర్ఘమైనది. ముందుగా "కోట" వద్దకు చేరాం. పైకి బస్సులకు అనుమతిలేదు. కేవలం పెయిడ్ ఆటోలు, చిన్నచిన్న వాహనాలే. దారిపొడవునా రకరకాల ఇత్తడి, రాగి పాత్రలు సరసమైన ధరలకే అందుబాటులో ఉన్నాయి. రాజపుత్రుల రాజు "రాజా బాదల్సెంగ్" నిర్మించిన ఆగ్రా కోట ఇటుకలతో కట్టిన కట్టడం. 1080వ సంవత్సరంలో మొదటిసారిగా చరిత్రకెక్కింది. అక్బర్ కాలంలో కోట నిర్మాణ రూపురేఖలు మారాయి. 1558లో రాజధానిగా చేసుకుని "ఎర్రరాతి"లో కోట పునర్మిర్మాణం చేశారు.

అక్బర్ తదనంతరం మనవడు షాజహాన్ మరింత మెరుగులు దిద్దించాడు. ఆగ్రాఫోర్ట్‌లో బట్టలు, చెప్పులతో పాటు, బహుమతుల కోసం ప్రత్యేక దుకాణాలు ఉంటాయి. ఇక సాయంత్ర సమయం ప్రపంచాన్ని పలకరించడానికి మరికొన్ని గంటలుందనగా తాజ్‌మ‌హ‌ల్‌కు బయలుదేరాం. దాదాపు కిలోమీట‌ర్‌కు ముందే బస్సులు, పర్యాటకుల వాహనాలు ఆపి, బ్యాటరీ మోటారు కార్లలో లేదా నడచి లేదా ఒంటెల మీద ప్ర‌యాణం చేసి ప్రధాన దర్వాజాలు చేరాం.

 mathura city

ఏమని వర్ణించగలం..

ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒక్కటిగా కీర్తింపబడే ఈ ప్రాంతం నిజానికి "సమాధుల ప్రాంతం". 14వ సంతానానికి జన్మనిస్తూ మరణించిన ముంతాజ్ జ్ఞాపకార్థం, యుమునా తీరాన 42 ఎకరాలలో, 73 మీటర్ల ఎత్తున 1632 నుండీ 53 వరకూ 20 వేల మంది కార్మికుల శ్రమకు ప్రత్యక్ష సాక్ష్యం. శుక్రవారం మినహా, అన్ని రోజులూ తెరిచి ఉంచే తాజ్‌మ‌హ‌ల్‌ను వెన్నెల రాత్రుల్లో తిలకించడం ఓ అద్భుతంగా భావిస్తారు కళాప్రియులు. షాజహాన్ సైతం తన మరణానంతరం అక్కడే ఖననం చేయబడ్డాడన్న సత్యం మదిలో మెదులుతుంది. విశాల ప్రాంగణం, ఉన్నతంగా గోడలు నాల్గుదిశలా మధ్యలో పచ్చటి లాన్లు.... భారతదేశ పర్యాటక ప్రాంతాలన్నింటిలోకి అత్యంత పరిశుభ్రమైన టాయిలెట్లు ఉంటాయి. అయితే వాటిలో విదేశీయులకు ఓ దారి, స్వదేశీయులకు ఓ దారి ఉంటుంది. వసూళ్లు చేసే ఫీజులు కూడా అలానే ఉంటాయిలెండి!

ఇక్క‌డ అన్ని భాషల్లో పుష్కలంగా గైడ్స్ దొరుకుతారు. ఆగ్రా దర్శనం… పున్నమి రాత్రుల్లో అయితే మంచిది. ఆగ్రాలో ప్రసిద్ధ వంటకం, బూడిద గుమ్మడితో చేసే “పేటా” హల్వాలా ఉన్నప్పటికీ కాస్త గట్టిగా ఉండే ఈ స్వీట్లో రకరకాల వెరైటీలు దొరుకుతాయి. అంతరాష్ట్ర విమాన సౌకర్యం, దేశం నలుమూలల నుండీ రైలు, రోడ్డు మార్గాలను అనుసంధానంతో ఆగ్రా పట్టణం ఉంది. కాకపోతే వసతి కాస్త ఖరీదు ఉంటుంది.