దేశంలో అత్యంత సేఫ్ సిటీగా మూడోస్థానంలో హైదరాబాద్; నేరాలలో టాప్ లో ఢిల్లీ!!

దేశంలో అత్యంత సేఫ్ సిటీల జాబితాలో హైదరాబాద్ మూడవ స్థానంలో నిలిచింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం కోల్‌కతా, పూణే తర్వాత దేశంలోనే అత్యంత సురక్షితమైన మెట్రో నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. 2014లో తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వరుస కార్యక్రమాల కారణంగా హైదరాబాద్ సురక్షితమైన నగరంగా కొనసాగుతోంది.

గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందే, తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే శాంతిభద్రతలు క్షీణిస్తాయని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు మేధావులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మావోయిస్టులు తమ కార్యకలాపాలను మరింత ఉధృతం చేస్తారని కూడా కొందరు చెప్పారు. అయితే వారి సందేహాలను నివృత్తి చేస్తూ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో శాంతిభద్రతలు గత ఎనిమిదేళ్లుగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని నివేదిక ఆధారంగా వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో శాంతిభద్రతలను సమర్థవంతంగా నిర్వహించడంలో పోలీసు శాఖ విజయం సాధించింది. ఈ ఫలితంగానే ప్రస్తుతం దేశంలో అత్యంత సేఫ్ సిటీలలో హైదరాబాద్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వం శాంతిభద్రతలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, తదనుగుణంగా పోలీస్ శాఖకు కొత్త పెట్రోలింగ్ వాహనాలతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పోలీసు స్టేషన్‌కు స్టేషనరీ మెటీరియల్‌ను కొనుగోలు చేసే మొత్తాన్ని కూడా పెంచిందని అధికారులు తెలిపారు. దీంతో పోలీస్ శాఖకు మౌలిక సదుపాయాలు ఎక్కువగా కల్పించడంతో, పోలీస్ శాఖ పనితీరు సులభం కాగా తెలంగాణలో శాంతియుత వాతావరణం నెలకొంది. రెండు మిలియన్ల జనాభా ఉన్న నగరాల్లో నేరాల నమోదును విశ్లేషించిన ఎన్‌సిఆర్‌బి ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో హైదరాబాద్‌లో ప్రతి మిలియన్ జనాభాకు 2,599 నేరాలు మాత్రమే జరుగుతున్నాయని పేర్కొంది.

భారతదేశ రాజధాని ఢిల్లీలో దేశంలోనే అత్యధిక నేరాల రేటు ఉందని ఎన్సీఆర్బీ రిపోర్ట్ వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి మిలియన్ జనాభాకు 18,596 నేరాలు జరుగుతున్నాయి. కేవలం 1,034 నేరాలతో, కోల్‌కతా అతి తక్కువ నేరాలు జరిగే మెట్రో నగరంగా అగ్రస్థానంలో ఉండగా, 2,568 నేరాలతో పూణే మెట్రో తర్వాతి స్థానంలో ఉంది. ప్రతి మిలియన్ జనాభాకు 2,599 నేరాలు మాత్రమే జరుగుతూ ఐటీ నగరంగా పేరొందిన హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరంగా మూడవ స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీలో నేరాల రేటు ఎక్కువగా ఉండగా, సూరత్, కొచ్చిన్, అహ్మదాబాద్, చెన్నై తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

దక్షిణాది మెట్రో నగరాల్లో కూడా హైదరాబాద్ అతి తక్కువ నేరాలతో ఉన్న నగరం కాగా, మరో ఐటీ నగరమైన బెంగళూరు ప్రతి మిలియన్ జనాభాకు 4,272 నేరాలతో సురక్షితమైన నగరాల్లో ఐదవ స్థానంలో ఉంది. లక్ష జనాభాను పరిగణనలోకి తీసుకుంటే కోల్‌కతాలో 104.4, పుణెలో 256.8, హైదరాబాద్‌లో 259.9 నేరాలు నమోదయ్యాయి. బెంగళూరులో 427.2, ముంబైలో 428.4 నేరాలు నమోదైనట్టు గా తెలుస్తుంది. ఇక హత్యల విషయానికొస్తే.. కోల్‌కతాలో 45, హైదరాబాద్‌లో 98, బెంగళూరులో 152, ఢిల్లీలో 454, ముంబైలో 162 కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నానికి సంబంధించి కోల్‌కతాలో 135, హైదరాబాద్‌లో 192, బెంగళూరులో 371, ఢిల్లీలో 752, ముంబైలో 349 కేసులు నమోదయ్యాయి.

అత్యాచార కేసులకు సంబంధించి కోల్‌కతాలో 11, హైదరాబాద్‌లో 116, బెంగళూరులో 117, ఢిల్లీలో 1,226, ముంబైలో 364 కేసులు నమోదయ్యాయి. మహిళలపై దాడులకు సంబంధించి కోల్‌కతాలో 127, హైదరాబాద్‌లో 177, బెంగళూరులో 357, ఢిల్లీలో 1023 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే కోల్‌కతాలో మూడు, హైదరాబాద్‌లో 11, బెంగుళూరులో 36, ఢిల్లీలో 25, ముంబైలో 16 దోపిడీలు జరిగాయి. దొంగతనాలకు సంబంధించి కోల్‌కతాలో 1246, హైదరాబాద్‌లో 2,419, బెంగళూరులో 6,066, ఢిల్లీలో 1,980, ముంబైలో 7,820 కేసులు నమోదయ్యాయి.