తెలుగుదేశం పార్టీకి గుడ్ బై!

ఇటీవలి కాలంలో ఎన్నికల వ్యూహకర్తలు అనే పదం బాగా పాపులర్ అయ్యింది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి కూడా తమ పార్టీల కోసం వ్యూహకర్తలను నియమించుకుంటున్నారంటే వారికి ఉన్న డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు. అదే క్రమంలో తమ బలాలు మరిచిపోయి వీరిపై ఆధారపడతుుండటం కూడా ఆయా పార్టీల శ్రేణులకు నచ్చడంలేదు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి రాజకీయాల్లోనే 40 సంవత్సరాల అనుభవం ఉంది. అయినప్పటికీ ఆ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకున్నారు.

గత ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టీడీపీ తన పార్టీకి ఇద్దరు వ్యూహకర్తలను నియమించుకుంది. ఒకరు సునీల్ కనుగోలు కాగా, మరొకరు రాబిన్ శర్మ. అయితే ఈ ఇద్దరు వ్యూహకర్తలకు ఒకరంటే ఒకరికి పడలేదు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవు అన్న సూత్రాన్ని నిజం చేశారు. వీరిమధ్య పోటీ పెరిగి వైరానికి దారితీయడంతో తెలుగుదేశం పార్టీలోని నేతలంతా గందరగోళానికి గురయ్యారు. షో టైమ్ కన్సల్టెన్సీ పేరిట రాబిన్‌ శర్మ, మైండ్ షేర్ అనలటిక్స్‌ తరఫున సునీల్ కనుగోలు నియమితులయ్యారు.

ప్రశాంత్ కిషోర్ బృందంలో సేవలందించిన రాబిన్ శర్మ టీడీపీ కోసం రెండున్నర సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అలాగే సునీల్ కూడా. వీరిద్దరూ చంద్రబాబుకు రాజకీయ వ్యూహాలు, లెక్కలు నేర్పిస్తున్నారు. అంటే తనకు తెలిసినవాటినే చంద్రబాబునాయుడు కొత్తగా నేర్చుకుంటున్నారు. అందుకు ఇద్దరు ఉపాధ్యాయులను నియమించుకున్నారు. పార్టీకి పునర్వైభవం తీసుకురావడంలో తప్పులేదుకానీ అందుకు అనుసరిస్తున్న పద్ధతిపై పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒకే సమయంలో ఇద్దరు వ్యూహకర్తలు సేవలందించడం కూడా సరికాదని సునీల్ నిర్ణయించుకోవడంతో ఆయన పార్టీని వీడినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఇప్పుడు తప్పుకోవడమే మంచిదని సునీల్ భావించారు. వాస్తవానికి ఎవరి సేవలు కావాలో తేల్చుకోవాలని వీరు బాబును కోరారు. నాలుగు నెలలు పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు భావించారు. బళ్లారికి చెందిన సునీల్ అమెరికాలో చదువుకొని ఐప్యాక్ లో పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ పేరుతో కన్సల్టెంట్ గా పనిచేశారు. 2014లో బీజేపీ అధికారం రావడం వెనక ఈ సంస్థ పాత్ర కూడా ఉంది. తమిళనాడులో స్టాలిన్ కు, ఏఐడీఎంకేకు, నితీష్ కుమార్ కు పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నారు. డేటా అనాలసిస్, బూత్ లెవల్ పోల్ మేనేజ్మెంట్, వ్యూహరచనలో ఈ సంస్థకు అనుభవం ఉంది.