తెలంగాణా, ఏపీతో పాటు దేశవ్యాప్తంగా భారీ దాడులతో విరుచుకుపడుతున్న ఎన్ఐఏ.. టార్గెట్ వాళ్ళే!!

దేశ వ్యాప్తంగా భారీ దాడులతో ఉగ్రవాద కార్యాకలపాలు సాగిస్తున్న సంస్థలపై ఎన్ఐఏ విరుచుకుపడుతుంది. పిఎఫ్ఐ సంస్థపై తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుండి ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్ , గుంటూరు లలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తనిఖీలను కొనసాగిస్తుంది. హైదరాబాదులోని ఉప్పల్, ఘట్కేసర్ ప్రాంతాలలో ఉన్న పి ఎఫ్ ఐ సంస్థ కార్యకర్తల ఇళ్లపై ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి. ఇక కరీంనగర్లోని ఎనిమిది ప్రాంతాలలో ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు గుంటూరులోని ఆటోనగర్ లోనూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్న వారిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్వయంతో ఉత్తర మరియు దక్షిణ భారతదేశంలోని 10 రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విరుచుకుపడుతోంది. భారీ ఎత్తున సోదాలను ప్రారంభించింది. ఉగ్రవాద శిబిరాలను ఏర్పాటు చేసి యువతను ఉగ్రవాద కార్యకలాపాల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారనే అనుమానంతో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల పీఎఫ్‌ఐతో సంబంధం ఉన్న 100 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు.

ఈ సోదాలు ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద తనిఖీలలో భాగంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. టెర్రర్ ఫండింగ్, శిక్షణా శిబిరాలను నిర్వహించడం మరియు నిషేధిత సంస్థల్లో చేరడానికి వ్యక్తులను సమూలంగా మార్చడం వంటి కార్యకలాపాలలో నిమగ్నమైన వారిగా గుర్తిస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పిఎఫ్ ఐ సభ్యుల ఇళ్లలో సోదాలు జరుపుతుందని అధికారి తెలిపారు. పీఎఫ్‌ఐ జాతీయ, రాష్ట్ర, స్థానిక నేతల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయని, ఇదే సమయంలో రాష్ట్ర కమిటీ కార్యాలయాన్ని కూడా తనిఖీ చేస్తామని అధికారులు తెలిపారు.

ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా, కేరళలోని మలప్పురంలోని మంజేరిలో ఉన్న పీఎఫ్‌ఐ చైర్మన్ ఓఎంఏ సలాం ఇంటిపై, 10 రాష్ట్రాల్లోని పీఎఫ్‌ఐ కార్యాలయాలపై ఏజెన్సీలు దాడులు నిర్వహిస్తున్నాయని ఏఎన్‌ఐ తెలిపింది . తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్, కరీంనగర్, గుంటూరులలోనూ , కోయంబత్తూరు, కడలూరు, రామ్‌నాడ్, దిండుగల్, తేని, తెన్‌కాసి సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లోని పీఎఫ్‌ఐ ఆఫీసు బేరర్‌ ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.

పురసవాక్కంలోని చెన్నై పీఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ పీఎఫ్‌ఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అసమ్మతి స్వరాల నోరు మూయించేందుకు చట్టబద్ధమైన ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్న ఫాసిస్టు పాలన అంటూ కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తున్నామని పీఎఫ్ఐ సంస్థ తెలిపింది.