టీ20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల రగడ: హెచ్‌సీఏకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

సెప్టెంబర్ 25వ తేదీన ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న టి20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకం పై రగడ కొనసాగుతుంది. నిన్న జింఖానా గ్రౌండ్స్ వద్ద టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు ఎగబడటంతో, సెక్యూరిటీ సిబ్బంది గేటుకు తాళం వేసి, గోడదూకి లోపలికి వచ్చిన వారిపై లాఠీఛార్జి చేశారు. దీంతో క్రికెట్ అభిమానులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జింఖానా గ్రౌండ్స్ లో టికెట్లను విక్రయించే కార్యాలయంపై దాడికి యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.

టిక్కెట్లను బ్లాక్లో అమ్ముకుంటున్నారని, ప్రతిరోజు టికెట్ల కోసం వచ్చి ఆఫీస్ చుట్టూ తిరిగిన టిక్కెట్లు ఇవ్వడం లేదని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి టి20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకం విషయంపై ఘాటుగా స్పందించారు. క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయాల అవకతవకలపై విచారణ జరుపుతామని, ఒకవేళ బ్లాక్లో అమ్మినట్టుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. టికెట్లు బ్లాక్లో అమ్మితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇక ఇదే సమయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నది కేవలం పదిమంది అనుభవం కోసం కాదని పేర్కొన్న ఆయన, ఉప్పల్ స్టేడియం కోసం తెలంగాణా ప్రభుత్వం 23 ఎకరాల భూమిని ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా వ్యవహరిస్తే సహించబోమని తేల్చిచెప్పారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ తో కలిసి నేడు ఉప్పల్ స్టేడియంను పరిశీలిస్తానని పేర్కొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

స్టేడియం సామర్థ్యం ఎంత? ఎన్ని టికెట్లు అమ్మారు అన్న దానిపై లెక్కలు తేలుస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. టిక్కెట్ల విక్రయాలు పారదర్శకంగా జరగాలని పేర్కొన్న మంత్రి, టి 20 క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలపై క్రీడ శాఖ, పోలీసుల నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. ఇక మ్యాచ్ కు సంబంధించిన టిక్కెట్ల విక్రయాలపై అన్ని లెక్కలు చెప్పాలని పేర్కొన్న మంత్రి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదని స్పష్టం చేశారు.

తెలంగాణ పరువు తీస్తే సీఎం కేసీఆర్ ఊరుకోబోరని, ఏ మాత్రం సహించేది లేదని తెగేసి చెప్పిన మంత్రి క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల కోసం అభిమానులు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. అవకతవకలు జరిగితే సహించేది లేదని గట్టిగా హెచ్చరించారు. నేడు ఉప్పల్ స్టేడియం ను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడనున్న నేపధ్యంలో టికెట్ ల బ్లాక్ మార్కెట్ వ్యవహారంలో ఏం చెయ్యబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది.