కేటీఆర్‌‌కు షాక్; పైసలు మావి… ప్రశంసలు ప్రకాష్ రాజ్ కా; కొండారెడ్డిపల్లి సర్పంచ్ అసహనం!!

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం కొండారెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆ గ్రామాభివృద్ధికి ప్రకాష్ రాజ్ ఎంతో చొరవ తీసుకున్నారని ఇటీవల ఒక ట్విట్టర్ పోస్ట్ లో మంత్రి కేటీఆర్ ప్రకాష్ రాజ్ ను కొనియాడడంపై కొండారెడ్డిపల్లి సర్పంచ్ మంత్రి కేటీఆర్ కు షాక్ ఇచ్చారు. పైసలు మావైతే ప్రశంసలు ప్రకాష్ రాజ్ కా అంటూ ప్రశ్నిస్తున్నారు.

అసలు ఇంతకీ ఏం జరిగిందంటే కొండారెడ్డిపల్లి గ్రామం రూపురేఖలు మారాయని ఆ గ్రామానికి చెందిన మధుసూదన్ రావు అనే వ్యక్తి మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ గ్రామంలోని రోడ్లు, ఫుట్ పాత్ లు, ఆహ్లాదకరంగా పెంచిన చెట్లు.. ఇలా గ్రామానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక ఈ ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్ ఈ గ్రామాన్ని ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్నారని, ప్రకాష్ రాజ్ తో పాటు ఇక ఈ గ్రామ ప్రగతికి కారణమైన స్థానిక ఎమ్మెల్యే అంజయ్యకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

అయితే అభివృద్ధి తాము చేసుకుంటే ప్రకాష్ రాజ్ కు కితాబు ఇవ్వడంపై కొండారెడ్డి పల్లి సర్పంచ్ అసహనం వ్యక్తం చేశారు. గ్రామాన్ని తమ సొంత నిధులతో అభివృద్ధి చేసుకున్నామని గ్రామ సర్పంచ్ పల్లె స్వాతి పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పూర్తిగా తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామాన్ని దత్తత తీసుకున్నామని చెబుతున్న ప్రకాష్ రాజ్ కంటే ఎక్కువ నిధులు ఖర్చు పెట్టామని గ్రామ సర్పంచ్ వెల్లడించారు. గ్రామాన్ని అభివృద్ధి చేసిన తమను అభినందించాల్సింది పోయి, ప్రకాష్ రాజ్ పై ప్రశంసలు కురిపించడం కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే 2015 సంవత్సరం సెప్టెంబర్ నెలలో కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత అక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, గ్రామ అభివృద్ధికి తన వంతు పనిచేస్తూ వచ్చారు. గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన ప్రకాష్ దత్తత గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం 12 వేల రూపాయలు సహాయంచేస్తే, తాను తన వంతుగా మరో 4 వేల రూపాయలు సహాయం చేస్తానని ప్రకటించారు. ఇలా గ్రామంలో అభివృద్ధి కోసం ప్రకాష్ తన వంతు సహాయం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ గ్రామాభివృద్ధికి ప్రకాష్ రాజ్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ప్రస్తుతం ఈ వ్యవహారమే కొండారెడ్డి పల్లి గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.