కమ్మ సామాజికవర్గంపై జగన్ ఆశ వదులుకున్నారా ? కొడాలి ఎగ్జిట్, ఎన్టీఆర్ పేరుమార్పు వెనుక ?

ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న సీఎం జగన్ .. ఆ ముద్ర పోగొట్టుకునేందుకు చాలానే శ్రమించాల్సి వచ్చింది. పార్టీలో కమ్మ సామాజిక వర్గ నేతలకు కాస్త ఎలివేషన్ ఇవ్వడం, మంత్రి, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. కానీ తాజాగా మారుతున్న పరిస్ధితుల్లో ఇక ఆ సామాజికవర్గంతో అవసరం తీరిపోయిందని భావిస్తున్నారో లేక ఎంతగా బుజ్జగించినా ఉపయోగం లేదని అనుకున్నారో జగన్ పక్కనబెట్టేస్తున్నారు.

ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా సీఎంగా ఉన్న చంద్రబాబు తన సొంత సామాజిక వర్గమైన కమ్మోరిని నెత్తిమీద పెట్టుకుని, మిగతా కులాల్ని పట్టించుకోలేదన్న వాదన వినిపించేది. ఈ వాదన కూడా వైసీపీనే బలంగా తెరమీదకు తీసుకొచ్చేంది. అమరావతిలో కమ్మవారికే అన్నీ కట్టబెట్టారని, 35 మంది డీఎస్పీ ప్రమోషన్లు ఇస్తే వారిలో అంతా కమ్మ సామాజికవర్గం వారే అంటూ దుష్ప్రచారం చేసింది. ఆ తర్వాత వాస్తవాలు బయటపడ్డాయి. అప్పట్లో అధికారంలోకి వచ్చేందుకు కమ్మ సామాజికవర్గాన్ని అలా టార్గెట్ చేసిన వైసీపీ.. అనంతరం అధికారంలోకి వచ్చాక అప్పటివరకూ కమ్మ సామాజికవర్గం చేతుల్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల కాంట్రాక్టుల్ని రివర్స్ టెండరింగ్ ద్వారా లాగేసుకుంది. అనంతరం రాజధానుల పేరుతో రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసింది. అలాగే మద్యం షాపుల్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంది. తద్వారా మూడు కీలక రంగాల్లో వారి ఆర్ధికమూలాల్ని దెబ్బతీసిందన్న ఆరోపణలు ఎదుర్కొంది.

వైసీపీలో కమ్మ సామాజిక వర్గ నేతలైన కొడాలి నాని, తలశిల రఘురాం, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తో పాటు మరికొందరికి మంత్రి, ఎమ్మెల్యే, నామినేటెడ్ పదవులు కట్టబెట్టిన జగన్ .. ఆ సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించారు. అప్పట్లో స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా ఉండటంతో వాటి కోసమే ఇలా పదవులిచ్చినట్లు ఆ తర్వాత వారికీ అర్ధమైంది. 2019 ఎన్నికల హవాను స్ధానిక ఎన్నికల్లో కొనసాగించడంలో విఫలమైతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావించిన జగన్.. వారికి ఆ పదవులు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. చివరికి స్ధానిక ఎన్నికలు ముగిశాక తిరిగి కమ్మ సామాజిక వర్గంపై జగన్ కొరడా ఝళిపించడం మొదలుపెట్టారు.

అమరావతి రాజధానిని మూడు రాజధానులుగా మార్చేసిన కమ్మ సామాజిక వర్గానికి షాకిచ్చిన జగన్.. అనంతరం స్ధానిక సంస్ధల ఎన్నికల తర్వాత వరుసగా కమ్మ నేతలకు షాకులిస్తూ వచ్చారు. చివరికి కేబినెట్ ప్రక్షాళనలో మిగతా సామాజిక వర్గాల్ని కొనసాగించి కమ్మ నేత అయిన కొడాలినానిని బయటికి పంపేశారు. ఆయన స్దానంలో మరో కమ్మ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీని కానీ తీసుకుంటారని భావించినా అలా జరగలేదు. టీడీపీ నుంచి తెచ్చిపెట్టుకున్న కమ్మనేతలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. చివరికి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గ నేతలకు పార్టీలో ప్రాధాన్యం వరుసగా తగ్గుతూ వచ్చేసింది. ఈ అసంతృప్తిని కవర్ చేసేందుకా అన్నట్లు మధ్యలో ఎన్టీఆర్ పేరును విజయవాడ జిల్లాకు పెట్టారు.

తాజాగా కమ్మ సామాజిక వర్గానికి, ఆ మాటకొస్తే రాష్ట్రంలో ప్రజానీకానికి ఆరాధ్య దైవంగా భావించే ఎన్టీఆర్ పేరు పెట్టిన విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి దాన్ని తీసేసి వైఎస్సార్ పేరు పెట్టుకున్నారు. ఈ మేరకు నిన్న అసెంబ్లీ, మండలిలో బిల్లు కూడా ఆమోదం తీసుకున్నారు. ఇక చట్టం చేయడమే తరువాయి. దీంతో విపక్ష టీడీపీతో పాటు కమ్మ సామాజిక వర్గం కూడా ఆగ్రహంతో రగిలిపోతోంది. నందమూరి కుటుంబంతో పాటు రాష్ట్రంలోని ఎన్టీఆర్ అభిమానులు, సాధారణ ప్రజలు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఇప్పటికే పార్టీలో కమ్మ నేతల్ని దూరం పెట్టేస్తున్న జగన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మార్పుతో పూర్తిగా ఆ సామాజిక వర్గాన్ని లెక్కచేయడం లేదని తేలిపోతోంది.
దీనికి నిరసనగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ నామినేటెడ్ పదవి వదులుకోగా.. వంశీ వంటి వారు ట్వీట్లు చేసారు.

అధికారంలోకి రాకముందు కమ్మ సామాజికవర్గ నేతలు తనపై చూపిన ద్వేషానికి అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టిన జగన్.. ఆ క్రమంలో కీలక నేతల్ని తమవైపు తిప్పుకోవడం ద్వారా రాజకీయానికి పదునుపెట్టారు. అయితే ఓ దశ దాటిన తర్వాత అది కూడా ఫలించడం లేదని తేలిపోవడంతో ఇక కమ్మ సామాజిక వర్గాన్ని, వారి ఓట్లను పూర్తిగా పక్కనబెట్టి మిగతా వారితో రాజకీయం చేసుకుందామన్న నిర్ణయానికి వచ్చేసినట్లు అర్ధమవుతోంది. అందుకే ఇప్పుడు అమరావతి పరిధిలోకి వచ్చే పాత కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో ఓట్లను కానీ, ఇక్కడి నేతల్ని కానీ జగన్ దూరం పెట్టేస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో సంబంధం లేకుండా వైసీపీ మరోసారి గెలవాలని జగన్ కోరుకుంటున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.