ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు – షర్మిల సంచలన వ్యాఖ్యలు..!!

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు పై వైఎస్ షర్మిల స్పందించారు. ఏపీలో ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్సార్ పేరు మార్చుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. దీని పైన టీడీపీతో సహా ప్రతిపక్ష పార్టీలు ఫైర్ అవుతున్నాయి. నందమూరి కుటుంబం ఈ నిర్ణయాన్ని ఖండించింది. ఎన్టీఆర్ హాయంలో స్థాపించిన వర్సిటీకి ఆయన పేరు సముచితమని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అదే సమయంలో అధికార పార్టీలోనూ కొందరు ఈ నిర్ణయం పైన భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని పైన సీఎం జగన్ అసెంబ్లీలో వివరణ ఇచ్చారు.

వైఎస్సార్ హయాంలో జరిగిన వైద్య సంస్కరణలు..పేదలకు అందుబాటు లోకి వచ్చిన ఆరోగ్య శ్రీతో సహా ఇతర సేవల గురించి వివరించారు. తమ ప్రభుత్వం ఏపీలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్ పైన తనకు గౌరవం ఉందని.. అందుకే ఎవరూ అడగకపోయినా విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఖరారు చేసి గౌరవించామని చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో చేసిన నిర్మాణాలు ఏవైనా ఉంటే..వాటికి ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని, టీడీపీ నేతలు అటువంటివి ఏమైనా ఉంటే తమకు చెప్పాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక, ఈ నిర్ణయం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న సమయంలోనే..సీఎం జగన్ సోదరీ, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల స్పందించారు.

ఒక ఇలా పేర్లు మార్చటం పైన తన అభిప్రాయం స్పష్టం చేసారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా పేర్లు మార్చకూడదని అభిప్రాయపడ్డారు. ఆ పేరు కొనసాగిస్తే వారికి గౌరవం ఇచ్చినట్లవుతుందని చెప్పుకొచ్చారు. కారణాలు ఏవైనా ఎవరి పేర్లు ఉన్నాయో, ఆ పేర్లే కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. దీని ద్వారా ఆ పేరుకు మరింత గౌరవం పెరుగుతుందని చెప్పారు. పేర్లు మార్చుతూ కొత్త పేర్లను డిసైడ్ చేస్తే అయోమయం ఏర్పడుతుందని షర్మిల వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పైన షర్మిల వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ ఇప్పుడు షర్మిల వ్యాఖ్యలను తమకు అనుకూలంగా.. సీఎం జగన్ ను రాజకీయంగా ఫిక్స్ చేయటానికి అస్త్రంగా మలచుకొనే అవకాశం కనిపిస్తోంది.

ఇప్పటికే టీడీపీ నేతలు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బడుతూ నిరసనలు కొనసాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అసలు హెల్త్ వర్సిటీకి..వైఎస్సార్ కు ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఎన్టీఆర్ పేరు పెడతామని వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ తన హయాంలో ఏదైనా నిర్మించింది ఉంటే ఆ కట్టడానికి వైఎస్సార్ పేరు నిర్ణయించాలని చంద్రబాబు సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ గా సమాధానం ఇచ్చారు. అయితే, ఇప్పటికే అసెంబ్లీలో పేరు మార్చుతూ బిల్లు ఆమోదం పొందింది. ఈ పేరు మార్పు పైన షర్మిల చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారనేది చూడాలి. షర్మిల వ్యాఖ్యలపైన ఇతర రాజకీయ పార్టీలు స్పందించే అవకాశం ఉంది.