ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై కళ్యాణ్ రామ్: రాజకీయమేనంటూ తీవ్ర స్పందన

అమరావతి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైయస్సార్ పేరు పెట్టడాన్ని సమర్థించుకుంటుండగా.. టీడీపీ నాయకులు, నందమూరి కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జగన్ సర్కారు ఈ చర్య సమర్థనీయం కాదని అంటున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించగా.. తాజాగా, ఆయన సోదరుడు, సినీనటుడు కళ్యాణ్ రామ్ కూడా స్పందించారు. పేరు మార్పు తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కేవలం రాజకీయ లాభం కోసం పేరు మార్చడం తప్పు అని కళ్యాణ్ రామ్ స్పష్టం చేశారు.

1986లో విజయవాడలో మెడికల్ యూనివర్సిటీ స్థాపించబడింది. ఆంధ్రప్రదేశ్‌లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్యం, విద్యను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకున్న ఎన్టీఆర్.. ఈ మహా విద్యాలయానికి అంకురార్పన చేశారు. ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది. లెక్కలేనన్ని నైపుణ్యం కలిగిన వైద్య నిపుణులను దేశానికి అందించిందని కళ్యాణ్ రామ్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో వైద్య అధ్యయనాల మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకునేందుకు విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని పేరు మార్చబడింది.

ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరును మార్చడం తనకు బాధ కలిగించిందని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి భావోద్వేగాలతో ముడిపడివున్న ఈ అంశాన్ని వాడుకోవడం తప్పు అంటూ కళ్యాణ్ రామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఇప్పటికే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఈ అంశంపై స్పందించిన విషయం తెలిసిందే. పేరు మార్చినంత మాత్రానా వైయస్సార్ స్థాయి పెరగదు.. ఎన్టీఆర్ స్థాయి తగ్గదు అని జూనియర్ ఎన్టీఆర్ ఘాటుగా స్పందించారు.