ఎన్టీఆర్ పేరు మార్పు – సీబీఐ మాజీ జేడీ కామెంట్స్..!!

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు పైన ఇంకా రగడ ఆగలేదు. రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం పేరు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా బిల్లును ఆమోదించింది. ఈ వివాదం కొనసాగుతున్న వేళ.. ప్రభుత్వం దీని పైన స్పష్టత ఇచ్చింది. ముఖ్యమంత్రి..మంత్రులు అసెంబ్లీ వేదికగా ఈ నిర్ణయానికి కారణాలను వెల్లడించారు. ఎన్టీఆర్ పైన తమకు అభిమానం ఉందని సీఎం చెప్పుకొచ్చారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం ఇదే అంశం పైన పెద్ద ఎత్తున విమర్శలు కొనసాగిస్తున్నారు.

ఇప్పుడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. తమిళనాడులో ఆ రాష్ట్ర సీఎం అధికారంలోకి వచ్చిన తీసుకుంటున్న నిర్ణయాలు..వ్యవహార శైలి ని వివరిస్తూ ఏపీ పరిస్థితులను పోల్చుతూ ట్వీట్ చేసారు. మాజీ జేడీ లక్ష్మీ నారాయణ చేసిన ట్వీట్ లో.. మన పక్కరాష్ట్రం తమిళనాడులో సీఎం స్టాలిన్ మాజీ సీఎం జయలలిత బొమ్మలతో ఉన్న స్కూల్ బ్యాగులు పంపిణీ చేసి, తన ఔనత్యాన్ని చాటారు. మనమేమో ఇక్కడ పాలకులు మారినపుడల్లా పేర్లు మార్చుకుంటూ నానా యాగీ చేస్తున్నాం. పేరు మార్పు కాదు… వ్యవస్ధల రిపేరు కావాలి..అని ట్వీట్ చేసారు.

లక్ష్మీ నారాయణ ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. కార్మికులకు మద్దతుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. గతంలో జనసేన నుంచి విశాఖ లోక్ సభకు ఆయన పోటీ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్ పైన నమోదైన అక్రమాస్తలు కేసులు విచారించారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఎన్టీఆర్ పేరు మార్పు పైన ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది. దీని పైన వైసీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.