ఆ వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు PFI, SDPI లింకులు ? బీజేపీ సంచలన ఆరోపణలు

దేశవ్యాప్తంగా పలు చోట్ల పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ), సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ)తో లింకులున్న వారిపై కేంద్ర నిఘా సంస్ధలు విరుచుకుపడుతున్నాయి. ఇవాళ వంద మందికి పైగా పీఎఫ్ఐ నేతలు, సానుభూతిపరుల్ని అరెస్టుచేశాయి. ఈ నేపథ్యంలో ఏపీలో అధికారపార్టీకి చెందిన కొందరికి కూడా ఈ పార్టీలతో లింకులున్నాయని బీజేపీ ఆరోపించింది.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ద్రోహులకు రక్షణ కల్పించి రాష్ట్రానికి పెనుముప్పును తెచ్చినట్లు ఏపీ బీజేపీ ఇవాళ ఆరోపించింది. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో ఆయన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పిఎఫ్‌ఐ), సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డిపిఐ)లకు సహకరిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను బర్త్‌రఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు.

విద్రోహ సంస్థలైన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పిఎఫ్‌ఐ), సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎస్‌డిపిఐ) కార్యకలాపాలు ఏపీ, తెలంగాణల్లో పెరిగిపోవడానికి కారణం రెండు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ఓటుబ్యాంకు రాజకీయాలేనని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాలను ఈ సంస్థలు ప్రధాన షెల్టర్‌గా వాడుకుంటున్నాయన్నారు. ఈ సంస్థల చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిఘా పెట్టలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మంత్రులు, ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు నేరుగా పిఎఫ్‌ఐ, ఎస్‌డీపిఐలకు సహకరిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

వీరు ఉగ్రవాద శిక్షణ తీసుకుని స్వయంగా ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసి తగులబెట్టి పోలీసులను భయభ్రాంతులకు గురిచేశారని విష్ణు ఆరోపించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో చెప్పినా ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయపట్టలేదని ప్రశ్నించారు. సదరు అధికారులను వేరే జిల్లాలకు బదిలీ చేశారని విమర్శించారు. స్వయంగా ఉపముఖ్యమంత్రి అంజాద్‌భాషా, స్ధానిక ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ సంఘటనా స్థలానికి వచ్చి నిందితులపై చర్యలు తీసుకోవద్దని పోలీసులపై వత్తిడి చేశారన్నారు.

గుంటూరులో పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన వారిపై కూడా వైసీపీ ప్రభుత్వం కేసులు ఎత్తివేసిందని విష్ణు ఆరోపించారు. రాయచోటిలోనూ పోలీస్‌స్టేషన్‌పై దాడిచేసిన వారిపై కేసులను ఎత్తేశారని,పెద్ద సభలు పెట్టి సన్మానాలు చేశారన్నారు. ఏపీలో నిజాయతీగా పనిచేసే పోలీసు అధికారులకు ఏం సందేశం ఇస్తున్నారన్నారు. ఓటు బ్యాంకు కోసం దేశ భద్రత, శాంతిభద్రతలను వైసీపీ, టీఆర్ఎస్ పణంగా పెడుతున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. పిఎఫ్‌ఐ, ఎస్‌డిపిఐకు సహకరిస్తున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను బర్త్‌రఫ్‌ చేయాల్సిందేనన్నారు.