అసెంబ్లీలో అన్నీ అబద్ధాలే-సాక్షాలివిగో…జగన్ కు ప్రివిలేజ్ నోటీసులివ్వాలన్న యనమల

ఐదురోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం వివరణలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. సీఎం జగన్ పోలవరం, ప్రాజెక్టులు, పెట్టుబడులు, ఆర్ధిక పరిస్ధితి ఇలా పలు కీలక అంశాలపై ప్రసంగాలు చేశారు. ఇందులో ప్రభుత్వం తరఫున ఎన్నో లెక్కలు చెప్పారు. వీటిలో ఆయన అబద్ధాలు ఆడారంటూ విపక్ష టీడీపీ ఆరోపిస్తోంది.

జగన్ రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితిపై అన్నీ అబద్ధాలే చెప్పారని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అసెంబ్లీకి అబద్దాలు చెప్పిన జగన్ రెడ్డికి ప్రివిలేజ్ నోటీసులివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఏకపక్షంగా సభ నిర్వహణ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి నియంతృత్వానికి ప్రయత్నాలు దుర్మార్గమని యనమల విమర్శించారు.

చట్ట సభల ప్రతిష్టకు, గౌరవానికి మచ్చ తెచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ట్రెజరీ నియమావళీ పాటించకుండా కేవలం ప్రభుత్వ ఉత్తర్వులతోనే రూ.26,839 కోట్లు చెల్లించారని యనమల ఆరోపించారు. రూ.9,124 కోట్ల కు సంబంధించి ఆర్ధిక శాఖ వద్ద వివరణే లేదన్నారు. కనీసం జీవోలు కూడా విడుదల చేయకుండా రహస్యంగా రూ.8,891 కోట్లు విడుదల చేయాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కు ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడం వెనుక ఏ శక్తి పనిచేస్తుందని యనమల నిలదీశారు. గత ఐదేళ్ల కంటే 20-21లో అతి తక్కువ వృద్ధిరేటు నమోదైందని కాగ్ స్పష్టం చేసిందని, రెవెన్యూ లోటు రూ.35,541 కోట్లతో ఐదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుందని, ఇది గత ఏడాదితో పోల్చితే 34.42 శాతం పెరిగిందన్నారు. ద్రవ్యలోటు 39.01 శాతం నుంచి 59.53 శాతానికి చేరుకుందని యనమల తెలిపారు. రూ. 6,278 కోట్లు రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయంగా చూపారని ఆయన ఆక్షేపించారు.

వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికను ఈసీ తప్పుబట్టడంపైనా స్పందించిన యనమల.. ప్రజాస్వామ్యంలో శాశ్వత అధ్యక్షులుండరన్నారు. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చామని చెప్పుకునే జగన్ రెడ్డికి స్థానిక సంస్థల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. పంచాయతీలకు సంబంధించిన రూ.854 కోట్లు 14 వ ఆర్దిక సంఘం నిధులు కొల్లగొట్టారని ఆయన విమర్శించారు. కేంద్ర పథకాలకు రాష్ట్రం తన వాటా ఇవ్వడం లేదని, రాష్ట్రంలో దాదాపు 2 లక్షల మంది గర్బిణులు ప్రధానమంత్రి మాతృవికాస యోజన కింద ఇచ్చే రూ.5 వేలు కోల్పోయారని యనమల విమర్శించారు. ఇదేనా మీరు సాధించిన అభివృధ్ది అని యనమల ప్రశ్నించారు.