అమరావతిపై వైసీపీ, టీడీపీలోనూ గుబులు ? పైకి కనిపించేది వేరు ! ఈ భయమే సాక్ష్యం…!

ఏపీలో అమరావతి రాజధాని పేరెత్తగానే ఇప్పుడు గుర్తుకొచ్చేపేరు టీడీపీ. ఎందుకంటే అమరావతి రాజధాని ఉద్యమంతో అంతగా మమేకపోయింది ఆ పార్టీ. అదే సమయంలో అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలించేందుకు ప్రయత్నిస్తున్న వైసీపీపై ఈ ప్రాంతంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో సీఎం జగన్ ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షిస్తూ లెక్కలు మార్చేస్తున్నారు. అయితే ఇదంతా పైకి కనిపించేదే. వాస్తవంగా ఏం జరుగుతోందో ఇప్పుడు చూద్దాం..

ఒకప్పుడు టీడీపీ హయాంలో రాజధానిగా మారి ఇప్పుడు వైసీపీ సర్కార్ దూకుడుతో మూడు రాజధానుల్లో ఒకటిగా మారుతుందని అంచనా వేస్తున్న అమరావతిలో తాజా పరిస్ధితులు ఎలా ఉన్నాయి. రాజధానిని కాపాడుకునేందుకు స్ధానిక రైతులతో కలిసి విపక్షాలు ఉద్యమిస్తున్న వేళ.. మూడు రాజధానుల్ని బలంగా తెరపైకి తెస్తూ వైసీపీ సాగిస్తున్న యజ్ఞం ఫలితమివ్వబోతోందా లేదా అనే ప్రశ్నలు రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో సైతం ఉత్కంఠ రేపుతున్నాయి. ఎందుకంటే పైకి కనిపించేది ఒకటి లోలోపల జరిగేది మరొకటి.

2019 ఎన్నికల తర్వాత మారిన పరిస్ధితుల్లో అమరావతిలో వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల తరహాలోనే ఇక్కడ కూడా వైసీపీ, టీడీపీ హోరాహోరీ తలపడుతున్నాయి. స్ధానికంగా నెలకొన్న రాజకీయాల్ని, తమ చేతుల్లోకి వచ్చిన అధికారాన్ని వాడుకుంటూ ఇక్కడ పైచేయి సాధించేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. స్ధానిక రైతుల అండతో రాజకీయాన్ని తమవైపు తిప్పుకునేందుకు టీడీపీ కూడా ప్రయత్నిస్తోంది. దీంతో అమరావతిలో వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ ఇప్పుడు రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వార్ మరికొన్ని రోజుల్లో మరింత తీవ్రరూపం దాల్చబోతోంది కూడా.

పైకి చూస్తే అమరావతికి అన్నివిధాలా అండగా నిలుస్తున్న టీడీపీకి రాజధానిలో పూర్తి మద్దతు లభించాలి. మరోవైపు అమరావతిని వ్యతిరేకిస్తూ మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన వైసీపీకి పూర్తి వ్యతిరేకత కనిపించాలి. కానీ వాస్తవంగా క్షేత్రస్ధాయిలో ఇదే పరిస్ధితి ఉందా అంటే కాదనే సమాధానమే వినిపిస్తోంది. అమరావతిలో టీడీపీకి మద్దతు దొరుకుతున్న మాట వాస్తవమే అయినా అది కచ్చితంగా ఇక్కడ అన్ని స్ధానాల్ని గెలిపించేలా, ప్రతీచోటా మెజారిటీ తెచ్చేలా ఉందా అంటే లేదు. అలాగని టీడీపీని కాదని 2019లో 29 స్ధానాలు కట్టబెట్టిన వైసీపీకి సైతం ఇప్పుడు ప్రతికూలత ఉందా అంటే పూర్తిగా కనిపించడం లేదు. దీంతో ఇరుపార్టీల్లోనూ విజయంపై అంతర్గతంగా భయం కనిపిస్తోంది.

అమరావతిలో ఈసారి వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు మాత్రం ఖాయమైపోయింది. కానీ అప్పటివరకూ ఎందుకు ఇప్పుడే అమరావతి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ సర్కార్ ఎన్నికలకు రమ్మని టీడీపీ సవాళ్లు చేస్తోంది. మూడు రాజధానులకు ఏపీలో మద్దతు ఉన్నట్లు నమ్మకముంటే అసెంబ్లీని రద్దుచేసి ముందుకు రమ్మని టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు కూడా వైసీపీని డిమాండ్లు చేస్తున్నారు. ఈ డిమాండ్ పై స్పందించి అమరావతి అజెండాపై మీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు రావాలని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. అలాగని వైసీపీ కూడా ఇక్కడ ఎన్నికలకు సిద్ధంగా ఉందా అంటే అదీ కాదు. మరోవైపు టీడీపీ అయినా అమరావతి ప్రాంతం పరిధిలోని ఉమ్మడి కృష్ణా,గుంటూరు జిల్లాల్లో రాజీనామాలు చేసి ఉపఎన్నికలు కోరతారా అంటే అదీ లేదు. దీంతో వైసీపీ, టీడీపీ ఇద్దరూ ఇక్కడ పల్స్ ఎలా ఉంటుందో తెలియక ప్రస్తుతానికి మైండ్ గేమ్ తోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది.