సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత.. టీ20 టికెట్ల కోసం రగడ; దాడికి యత్నం!!

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం హైదరాబాద్ లో ఆగ్రహజ్వాలలు మిన్నుముడుతున్నాయి. టికెట్ల కోసం వచ్చిన వారికి కాకుండా బ్లాకులో టిక్కెట్లు విక్రయిస్తున్నారని, క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఇక టికెట్లు లేవని క్రికెట్ అసోసియేషన్ సిబ్బంది, టికెట్లు ఇచ్చి తీరాలని అభిమానుల ఆందోళనల నడుమ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

టీ 20 మ్యాచ్ టిక్కెట్ల కోసం క్రికెట్ అభిమానులు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఆందోళన చేపట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అభిమానులు టికెట్ల కోసం ఎగబడటంతో సెక్యూరిటీ సిబ్బంది లాఠీఛార్జ్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. క్రికెట్ అసోసియేషన్ పై దాడి చేయడానికి క్రికెట్ అభిమానులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సెప్టెంబర్ 25వ తేదీన ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం లో ఇండియా ఆస్ట్రేలియా టి 20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ టికెట్లు సికింద్రాబాద్ జింఖానా హెచ్సీఏ కార్యాలయంలో మంగళవారం నుండి లభిస్తాయని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ వద్ద బారులు తీరారు. వివిధ జిల్లాల నుంచి సైతం క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ వద్దకు చేరుకొని టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు.

టికెట్ల కోసం పడిగాపులు పడిన వారికి టికెట్లు అయిపోయాయని చెప్పి, పెద్ద ఎత్తున జనాలు టికెట్ల కోసం ఎగబడుతున్న క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది గేటుకు తాళాలు వేయడంతో గోడదూకి లోపలికి దూసుకెళ్లారు క్రికెట్ అభిమానులు. సెక్యూరిటీ గార్డులు లాఠీచార్జి చేయడంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. క్రికెట్ టికెట్ల కోసం జనం తండోపతండాలుగా రావటంతో లంబా టాకీస్ రోడ్డుపై తీవ్రంగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.

ఇక టికెట్ల కోసం వేచి చూస్తున్న క్రికెట్ అభిమానులు టికెట్లు ఇచ్చే వరకు అక్కడి నుండి కదిలేది లేదని తేల్చి చెబుతున్నారు. టికెట్ల కోసం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. హెచ్సీఏ కు, అజారుద్దీన్ కు , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి టికెట్ల కోసం తిరుగుతున్నా టికెట్లు ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు లేవని అక్కడ ఉన్న సిబ్బంది చెబుతున్నా అవేవీ పట్టించుకోకుండా క్యూలైన్లలో ఫ్యాన్స్ పడిగాపులు పడుతున్నారు. అయితే ఆన్ లైన్ లోనే టికెట్ల అమ్మకాలు మొత్తం జరిగాయని తెలియడంతో ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ లో అమ్ముకున్నారని మండిపడుతున్నారు.

సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ వద్ద ఉద్రిక్తత.. టీ20 టికెట్ల కోసం రగడ #T20match #Uppalstadium #T20 pic.twitter.com/5YoDkkc0Aa