వెయ్యి ఎకరాల భూమి నిషేధితజాబితా నుండి ఎలా మారింది? భూదందాకు రూపకర్త కేసీఆర్: ఈటల

తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని, భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ప్రయోజనం ఏమిటో అర్థం కావడం లేదని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. భూ సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ ను ఎందుకు తీసుకు వచ్చిందో చెప్పాలని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రంగారెడ్డి జిల్లా గండి పేటలో వేల కోట్లు విలువచేసే వెయ్యి ఎకరాల భూమి ధరణిలో నిషేధిత జాబితాలో ఉందని ప్రగతి భవన్ తో సంబంధమున్న రియల్ ఎస్టేట్ మాఫియా పైరవీతో ఆ భూమి నిషేధిత జాబితా నుండి మారిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. రాజధాని చుట్టుపక్కల వేల కోట్ల విలువ చేసే భూములను అధికార పార్టీ ముఖ్యులు, వారి బినామీలతో కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టుల్లో దండుకున్న కమీషన్ల కంటే ధరణి ద్వారా పెద్ద ఎత్తున దందా జరుగుతోందని ఈటల రాజేందర్ ఆరోపించారు.

భూ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వ పెద్దలు వేల ఎకరాలు కొట్టేస్తున్నారు అని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో భూ దందాకు రూపకర్త, సృష్టికర్త సీఎం కేసీఆర్ అని ఈటల రాజేందర్ విమర్శించారు. ధరణి లో నమోదైన భూముల రిజిస్ట్రేషన్ లు, భూముల క్రయ విక్రయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన ఆయన, ప్రజలను వేధించే హక్కు సీఎం కేసీఆర్ కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. దేశంలోని భూములన్నీ ఎన్ ఐ సి లో భద్రంగా ఉన్నాయన్న ఈటల రాష్ట్రంలో మాత్రం ఇప్పటికే నాలుగు సంస్థలు మార్చారు అంటూ ఆరోపణలు గుప్పించారు.

భూ సమస్య వివాదాలు పరిష్కారం కాక చాలామంది రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారని, భూ వివాదాల పరిష్కారం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఈటల రాజేందర్ అసహనం వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాలలో భూమిలో సగం భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి అనుమతించబడుతుంది అని, సగభాగం రిజిస్ట్రేషన్ కు అనుమతించడం లేదని, ఇది కొనుగోలుదారులను, అమ్మకందారులను గందరగోళానికి గురి చేస్తుందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.