పేదల భద్రతే సీఎం లక్ష్యం.!విమర్శిస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి కొప్పుల ఈశ్వర్.!

ధర్మారం/హైదరాబాద్ : పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించేందుకు ఆసరా పింఛన్లు పథకం అమలు చేస్తున్నామని, సీఎం చంద్రశేఖర్ రావు నిర్ణయం మేరకు 57 ఏళ్ళకు వయోపరిమితి తగ్గించడంతో నూతనంగా 10 లక్షల ఫించన్ లు మంజూరు చేసామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో నూతనంగా 1783 లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు కొప్పుల ఈశ్వర్. నూతన పెన్షన్లతో కలిపి ధర్మపురి నియోజవర్గ పరిధిలో మొత్తం 60వేల మందికి ఆసరా పింఛన్లు అందిస్తున్నందుకు సీఎం చంద్రశేఖర్ రావుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

దేశ వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగుల‌కు మాత్ర‌మే పెన్ష‌న్లు ఇస్తుంటే, దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒంట‌రి మ‌హిళ‌లు, బీడీ కార్మికులకు, చేనేత, గీత కార్మికులకు పెన్ష‌న్లు ఇస్తున్నదని మంత్రి అన్నారు. హెచ్.ఐ.వి, బోదకాలు బాధితులతో పాటు తాజాగా డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్లు అందించడానికి సీఎం చంద్రశేఖర్ రావు నిర్ణయించారని మంత్రి పేర్కొన్నారు. పేద‌ల‌కు గౌర‌వ ప్ర‌దంతోపాటు భ‌ద్ర‌త‌తో కూడిన జీవితాన్ని ఇవ్వాల‌ని సీఎం చంద్రశేఖర్ రావు భావించి, దివ్యాంగులకు 3016/-, ఇతర వర్గాలకు 2016/- రూపాయ‌ల వ‌ర‌కు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.

ప్రధానమంత్రి గుజరాత్ రాష్ట్రంలో కేవలం 600/- మాత్రమే పెన్షన్ అందిస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో కంటే అధిక సంఖ్యలో మన రాష్ట్రంలో పేదవారికి పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. సాగునీరు, పంట‌ల పెట్టుబ‌డులు, పంట రుణాలు, రుణ విముక్తి, రైతు బీమా, క‌ళ్యాణ ల‌క్ష్మీ, షాదీ ముబార‌క్‌, కెసిఆర్ కిట్ వంటి అనేక ప‌థ‌కాల‌ను అమలు చేస్తోందని మంత్రి ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. ధర్మారం మండలంలో నూతనంగా 1783 పెన్షన్లు మంజూరు అయినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆసరా లబ్ధిదారుడికి ఆసరా గుర్తింపు కార్డు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ అందించి సరఫరా చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రైతులకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని, ప్రతి సంవత్సరం 10వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలను అభివృద్ధి చేశామని, హరితహారం కింద చేపట్టిన చర్యల ద్వారా పచ్చని గ్రామాలు, పట్టణాలు ఆవిష్కృతమవుతున్నాయని మంత్రి తెలిపారు.

మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వల్ల 250 కిలో మీటర్ల మేర గోదావరి నది సజీవంగా ఉందని, మత్స్య సంపద భారీగా పెరిగిందని మంత్రి అన్నారు. రామగుండం ప్రాంతంలో నూతన వైద్య శాల, అనుబంధ ఆసుపత్రి ఏర్పాటు అవుతున్నాయని, త్వరలో మేడారంలో 30 పడకల ఆసుపత్రి ప్రభుత్వం మంజూరు చేస్తుందని మంత్రి తెలిపారు‌. ధర్మారం జడ్పిటిసి పద్మజ, ఎంపీపీ కరుణశ్రీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చిరెడ్డి, లబ్దిదారులు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.