టాప్ కమేడియన్ కన్నుమూత: విషాదంలో ఫిల్మ్ ఇండస్ట్రీ

న్యూఢిల్లీ: ప్రముఖ స్టాండప్ కమేడియన్ రాజు శ్రీవాస్తవ కన్నుమూశారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. భార్య శిఖా, కుమార్తె అంతర, కుమారుడు ఆయుష్మాన్ ఉన్నారు. గుండెపోటుకు గురైన అనంతరం ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో చేరారు. నెలన్నర రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజు శ్రీవాస్తవ మృతి పట్ల బాలీవుడ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సంతాపం తెలిపింది.

కిందటి నెల 10వ తేదీన తీవ్ర గుండెపోటుకు గురయ్యారు రాజు శ్రీవాస్తవ. ట్రెడ్ మిల్ మీద రన్నింగ్ చేస్తోన్న సమయంలో హఠాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఎయిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచీ ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. అత్యాధునిక వైద్య చికిత్స అందించారు. ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. సీటీ స్కాన్ తీయగా.. బ్రెయిన్ ఉబ్బినట్టు కనిపించింది. యాంజియోప్లాస్టీ చేశారు. గుండెలో బ్లాక్స్ ఉన్నట్లు నిర్ధారించారు.

Comedian Raju Srivastava passes away in Delhi at the age of 58, confirms his family.

He was admitted to AIIMS Delhi on August 10 after experiencing chest pain & collapsing while working out at the gym.

(File Pic) pic.twitter.com/kJqPvOskb5

చికిత్స కొనసాగుతుండగానే ఈ ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. రాజు శ్రీవాస్తవ మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. రాజు శ్రీవాస్తవ పలు బాలీవుడ్ సినిమాల్లో నటించారు. 1988లో అనిల్ కపూర్-మాధురి దీక్షిత్ జంటగా వచ్చిన సూపర్ హిట్ మూవీ తేజాబ్‌తో ఎంట్రీ ఇచ్చారు. మైనే ప్యార్ కియా, బాజీగర్, మిస్టర్ ఆజాద్, అభయ్, బిగ్ బ్రదర్, బరూద్, టాయ్‌లెట్: ఏక్ ప్రేమ్ కథ వంటి సిినిమాల్లో నటించారు. ఫిరంగీ ఆయన నటించిన చివరి చిత్రం.

బుల్లితెరపై కామెడీ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. అనేక టీవీ సిరీస్‌లు, టాక్ షోల్లో కనిపించారు. పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించారు. ది కపిల్ శర్మ షోలోనూ పాల్గొన్నారు. 2009లో బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా ఉన్నారు. నాచ్ బలియె, కామెడీ నైట్స్ విత్ కపిల్, అదాలత్, కామెడీ సర్కస్‌లతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజు శ్రీవాస్తవ మృతిపట్ల బాలీవుడ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సంతాపం తెలిపారు.