జోరుగా సాగుతున్న గంజాయి దందా.. వరంగల్ జిల్లాలో కోటిరూపాయల విలువైన గంజాయి సీజ్

ప్రభుత్వాలు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే గంజాయి అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. గంజాయి స్మగ్లర్లు అక్రమ రవాణాను పట్టుకోకుండా ఉండేందుకు ఎవరికీ దొరక్కుండా రకరకాల మార్గాలలో గంజాయి దందా సాగిస్తున్నారు. రైళ్లు, బస్సులలో రవాణా చేయడం, నిత్యావసర వస్తువులను సరఫరా చేసే లారీలలో పంపే ప్రయత్నం చేయడం, ఇక వాహనాలలో ప్రత్యేకమైన సీక్రెట్ లాకర్లను ఏర్పాటు చేయడం వంటి అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. పక్కా సమాచారం ఉంటే తప్ప ఒక్కోసారి గంజాయి అక్రమ రవాణాను పట్టుకోవటం పోలీసులకు ఇబ్బందిగా మారింది.

గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం కోసం, గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నివారణకు చర్యలు తీసుకోవడం కోసం తెలంగాణా రాష్ట్రం ప్రత్యేకంగా దృష్టి సారించి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నప్పటికీ గంజాయి దందాకు అడ్డుకట్ట పడటం లేదు. నిత్యం గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడుతున్న ఘటనలే అందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఒక వాహనాన్ని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని బుధ రావు పేట శివారులో డిసిఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఐదు వందల యాభై కిలోల ఎండు గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.

పట్టుకున్న గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. బలిమెల నుండి హైదరాబాద్ కు తరలిస్తుండగా ఈ గంజాయిని పట్టుకున్నట్టు టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. ఈ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరో నలుగురు పరారీలో ఉన్నట్లు గా తెలుస్తుంది. ఇక పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇదే సమయంలో ఈ గంజాయిని ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారు. ఈ గంజాయి దందా వెనుక వున్న వారెవరు వంటి అనేక విషయాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వరుసగా వరంగల్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి గంజాయి అక్రమ రవాణా అవుతున్న కేసులు కూడా ఇటీవల కాలంలో బాగా నమోదయ్యాయి. తాజాగా విశాఖ నుండి ఢిల్లీకి వరంగల్ మీదుగా అక్రమ రవాణా చేస్తున్న ఓ ముఠాను వరంగల్ పోలీసులు పట్టుకున్నారు.