జగన్ హీరో, కానీ : బాలకృష్ణ ఇంట్లో కాల్పుల వేళ- ఎన్టీఆర్ కు భారతరత్న పైనా : యార్లగడ్డ సంచలనం..!!

ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా వివాదాస్పదంగా మారుతోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించింది. దీనికి కాసేపట్లో ఆమోదం లభించనుంది. దీని పైన టీడీపీ సభలో ఆందోళనకు దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇక, ప్రభుత్వంలోని దీని పైన కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

నాడు ఎన్టీఆర్ తో సన్నిహితంగా మెలిగిన..ప్రస్తుత ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేసారు. ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు మార్పు నిర్ణయం తనకు బాధ కలిగించిందని చెప్పారు. ఇదే సమయంలో యార్లగడ్ద లక్ష్మీ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ హీరో గా అభివర్ణించారు.

నాడు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటన గురించి ప్రస్తావించారు. నాడు బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఘటన తెలుసుకొని తాను నాటి సీఎం వైఎస్సార్ ను కలవటానికి వెళ్లానని చెప్పారు. అప్పుడు వైఎస్సార్ తానెందుకు వచ్చనో తెలుసని చెబుతూ..ఏం ప్రాబ్లం లేదంటూ తనతో వ్యాఖ్యానించారని వివరించారు.

తమ మీద కాల్పులు జరిగాయని ఎక్కడా ఎవరూ ఫిర్యాదు చేయలేదనే విషయాన్ని చెప్పుకొచ్చారు. అదే సమయంలో బాలకృష్ణ ను పరామర్శించాల వద్దా అనే అంశం పైన చంద్రబాబు పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేసి అభిప్రాయం కోరారని యార్లగడ్డ వివరించారు. అదే విధంగా ఎన్టీఆర్ కు భారత రత్న ఇచ్చే అంశం పైన యార్లగడ్డ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తారని..కానీ, అసలు విషయం వేరే ఉందన్నారు. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో డాక్టర్ సీ నారాయణ రెడ్డితో కలిసి తాను ప్రధానిని కలిసిన సందర్భాన్ని వివరించారు.

ఆ సమయంలో ఎన్టీఆర్ భారత రత్నకు అర్హులని చెబుతూనే.. చంద్రబాబు కారణంగానే ఇవ్వలేకపోయారని వైఎల్పీ వివరించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇస్తే లక్ష్మీపార్వతి ఆ అవార్డును అందుకుంటారని..అది ఆయనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు కారణాలు ఏవైనా ప్రభుత్వం యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పును ఆయన వ్యతిరేకించారు. మద్రాస్, హైదరాబాద్ అబిడ్స్ లో ఎన్ టి ఆర్ నివాస గృహాలను నిర్లక్ష్యం చేసి అమ్మివేసింది చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్ లో ఎన్ టి ఆర్ చనిపోయిన గృహాన్ని పడేసి అపార్ట్మెంట్ లు కట్టడం కన్నా విషాదం ఏమైనా ఉందా అని ప్రశ్నించారు.