గుజరాత్ లో బీజేపీకి చుక్కలు ? ఓవైపు నిరసనల హోరు-మరోవైపు ఆప్ తో పోరు..

గుజరాత్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఎలాగైనా విజయం సాధించి అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బతీసి నాలుగు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీకి ఈసారి పరిస్దితులు పూర్తి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ స్దానంలో గట్టి ప్రతిపక్షంగా మారిన ఆప్ తో ఓవైపు పోరాడుతున్న గుజరాత్ బీజేపీ సర్కార్ కు మరోవైపు ఉద్యోగులతో పాటు ఇతర వర్గాల నిరసనలు తలనొప్పిగా మారిపోతున్నాయి.

పాత పెన్షన్ విధానంపై ఆప్ ఇచ్చిన హామీతో ఉద్యోగులు బీజేపీ సర్కార్ పై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టారు. దీంతో రాష్ట్రంలో ప్రతీ చోటా ఇప్పుడు ఉద్యోగులు పాత పెన్షన్ విధానం కోరుతూ బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. అలాగే మిగతా వర్గాల్లోనూ గుజరాత్ ప్రభుత్వంపై నమ్మకం సడలుతోంది. దీంతో వారంతా క్రమంగా రోడ్లపైకి వస్తున్నారు. ఎన్నికల ఏడాది వీరిని బుజ్జగించేందుకు భూపేంద్ర పటేల్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో బీజేపీకి ఈసారి అధికారం దక్కడం కష్టమన్న భావన వినిపిస్తోంది.

గతంలో మత విద్వేషాలతో గుజరాత్ లో రాజకీయాలు చేస్తూ వచ్చిన బీజేపీకి ఇప్పుడు ఆప్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు. దీనికి తోడు ఆప్ ఇస్తున్న హామీలు బీజేపీని కకావికలం చేస్తున్నాయి. గుజరాత్ ఎన్నికల భయంతోనే ఢిల్లీలో ఆప్ నేతలపై సీబీఐ, ఈడీతో కేంద్రం దాడులు చేయిస్తోందన్న ప్రచారం కూడా ఇప్పుడు పెరుగుతోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను లిక్కర్ స్కాంలో అరెస్టు చేస్తారంటూ కేజ్రివాల్ మొదలుపెట్టిన మైండ్ గేమ్ బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. దీంతో ఇప్పుడు ఆయన అరెస్టు ఊసే లేదు.