కృష్ణా జిల్లాలోకి ప్ర‌వేశించిన పాద‌యాత్ర‌

రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన రైతుల మహా పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. తొమ్మిదోరోజు బాపట్ల జిల్లాలోని రేపల్లె శివారు నుంచి ప్రారంభమై పెనుమూడి వారధి మీదుగా కృష్ణాలోకి అడుగుపెట్టింది. సాయంత్రానికి చల్లపల్లిలో విరామం ఉంటుంది. పెనుమూడి వారధిపై అమ‌రావ‌తి రైతుల‌కు కృష్ణా జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు.

ఈ సంద‌ర్భంగా వారధిపై సందడి వాతావరణం నెల‌కొంది. వంతెన కింద కృష్ణ‌మ్మ ప‌ర‌వ‌ళ్లు.. వంతెన పైన జ‌న ప్ర‌వాహంతో ఆకుప‌చ్చ‌ని శోభితంగా పాద‌యాత్ర సాగింది. ప్ర‌భుత్వం అమ‌రావ‌తికి చేసిన అన్యాయాన్ని ప్ర‌జ‌లంతా గుర్తించార‌ని, అందుకే ఈస్థాయిలో మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్న‌రాని రైతులు చెబుతున్నారు. ఎన్ని అడ్డంకులెదురైనా అంతిమ విజ‌యం త‌మ‌దేన‌న్నారు.

రాజ‌ధాని నిర్మాణం కోసం అమ‌రావ‌తి ప‌రిధిలోని 29 గ్రామాల రైతులు త‌మ భూముల‌ను ప్ర‌భుత్వానికి అప్ప‌గించారు. పూర్తిస్థాయి ప్ర‌ణాళిక‌తో నిర్మాణాలు జ‌రుగుతున్న స‌మ‌యానికి రాష్ట్రంలో తెలుగుదేశం ప్ర‌భుత్వం మారి వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చింది. అమ‌రావ‌తితోపాటు విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూలు కూడా రాజ‌ధానిగా ఉంటాయ‌ని, మూడు రాజ‌ధానులు త‌మ విధాన‌మంటూ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

దీంతో అమ‌రావ‌తి ఒక‌టే రాజ‌ధానిగా ఉండాల‌ని, తామిచ్చిన భూముల‌ను అభివృద్ధి ప‌రిచి ఇవ్వాలంటూ రైతులు కోర్టును ఆశ్ర‌యించారు. ఆరునెల‌ల్లోగా అభివృద్ధి ప‌నులు జ‌రిపి వారికి అప్ప‌గించాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. తాజాగా ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యాన్ని సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. అక్క‌డ కూడా త‌మ‌కే అనుకూలంగా తీర్పు వ‌స్తుంద‌నే ఆశాభావంతో రైతులున్నారు.

సెప్టెంబ‌రు 12వ తేదీతో తాము ఉద్య‌మం ప్రారంభించి 1000 రోజులు పూర్తికావ‌డంతోపాటు ‘అసెంబ్లీ టు అర‌స‌వెల్లి’ పేరుతో 60 రోజుల‌పాటు మ‌హాపాద‌యాత్ర‌ను ప్రారంభించారు. ఈ యాత్ర‌కు ముందు ‘న్యాయ‌స్థానం టు దేవ‌స్థానం’ పేరుతో హైకోర్టు నుంచి అలిపిరి వ‌ర‌కు పాద‌యాత్ర పూర్తిచేశారు.