ఒక్కమాటలో చెప్పాలంటే – దేశాన్ని నడిపిస్తోన్నది మనమే..!!

న్యూఢిల్లీ: ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాలు పురోగతి సాధించాయా?, కీలక సెగ్మెంట్లల్లో నార్త్ కంటే సదరన్ స్టేట్సే ఎంతో మెరుగ్గా ఉన్నాయా?.. దేశాన్ని అగ్రపథాన తీసుకెళ్తోన్నది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకలేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశం అభివృద్ధి సాధించిందనడానికి కొలమానాలుగా భావించే రంగాల్లో దక్షిణాది రాష్ట్రాలు నార్త్ కంటే ఎంతో గొప్పగా పురోగమించాయని డేటా సైంటిస్ట్ నీలకంఠన్ వెల్లడించారు. దీన్ని బీబీసీ ప్రచురించింది.

దక్షిణాది రాష్ట్రాలు ఆరోగ్యం, విద్య, ఆర్థిక అవకాశాల విషయంలో ఉత్తరాది కంటే మెరుగ్గా ఉన్నట్లు డేటా చెబుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న శిశు మరణాల రేటును దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోల్చి చూస్తే ఎంతో మెరుగ్గా ఉంటోంది. శిశుమరణాల రేటులో మధ్యప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, ఒడిషా, రాజస్థాన్, బిహార్, ఉత్తరాఖండ్ ఆ తరువాతి స్థానాలో నిలిచాయి. బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తల్లి మరణించే అవకాశం కూడా దక్షిణాది రాష్ట్రాల్లోనే చాలా తక్కువ.

చిన్నారికి అందాల్సిన ఆరోగ్య సేవలు, మెరుగైన పోషకాహారం కూడా ఉత్తరాదితో పోల్చుకుంటే సౌత్‌లోనే మెరుగ్గా లభిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో జన్మించిన చిన్నారులు ఉత్తరాదిలో పుట్టిన వారి కంటే ఆరోగ్యవంతమైన, మెరుగైన, భద్రతతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారని ఈ డేటా వెల్లడించింది. ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాల విషయంలో యూరప్‌కు సబ్ సహారా ఆఫ్రికాకు మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉంది.

కేరళలో విద్య, ఆరోగ్య ప్రమాణాల మెరుగుదలకు రాజకీయ చైతన్యం, ఆ రాష్ట్రంలో ఉన్న వైవిధ్యమైన సంస్కృతి వల్ల సాధ్యమైంది. దక్షిణాదిన ఉన్న ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో ఉత్తరాదితో పోలిస్తే జనాభా తక్కువ. ఇక్కడ జనాభా పెరుగుదల కూడా తక్కువగానే ఉంది. జీఎస్‌టీని ప్రవేశపెట్టడంతో దక్షిణాది రాష్ట్రాలు తమ సొంత ఆదాయాన్ని మెరుగు పరుచుకోవడానికి అవకాశాలు తగ్గిపోయాయి.

1971 నుంచి 2011 జనాభా లెక్కల వరకు చూసుకుంటే దక్షిణాది కంటే ఉత్తరాది రాష్ట్రాల్లోనే జనాభా పెరుగుదల విపరీతంగా ఉంటోంది.50 శాతానికి పైగా జనాభా పెరుగుదల చోటు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ అగ్రస్థానంలో ఉంది. హర్యానా, బిహార్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, గోవా ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.