ఏపీ అసెంబ్లీకి పెగాసస్ రిపోర్ట్-డేటా చౌర్యం నిజమే-టీడీపీ సేవామిత్ర యాప్ తో వైసీపీ ఓట్ల తొలగింపు

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పైవేర్ వాడారంటూ వచ్చిన ఫిర్యాదులపై విచారణ కోసం నియమించిన సభాసంఘం ఇవాళ అసెంబ్లీకి తమ మధ్యంతర నివేదిక సమర్పించింది. స్పీకర్ కు కూడా ప్రత్యేకంగా నివేదిక అందించింది. ఇందులో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రహస్యంగా ఉండాల్సిన సమాచారం లీకైందని, దీన్ని అప్పటి అధికార టీడీపీ ఎలా వాడుకుందో కమిటీ స్పష్టంగా వివరించింది.

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెగాసస్ స్పైవేర్ వాడటం ద్వారా విపక్షంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేశారంటూ వచ్చిన ఆరోపణలపై ఈ ఏడాది ప్రభుత్వం అసెంబ్లీ ఉపసంఘం ద్వారా విచారణకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన సబ్ కమిటీ సభ్యులు.. ప్రభుత్వ విభాగాల ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. అలాగే టీడీపీ పాత్ర ఏమేరకు ఉందన్న దానిపై కూలంకషంగా విచారణ జరిపారు. చివరికి 2017-19 మధ్య డేటా చౌర్యం వ్యవహారం లో శాసన సభ కు మధ్యంతర నివేదికను సభా సంఘం సమర్పించింది.

పెగాసస్ పై అసెంబ్లీతో పాటు స్పీకర్ కు సభాసంఘం సమర్పించిన పెగాసస్ రిపోర్ట్ లో పలు సంచలనాలు చోటు చేసుకున్నాయి. ఇందులో డేటా చౌర్యం ఎలా జరిగింది, అందులో అప్పటి టీడీపీ ప్రభుత్వం పాత్ర ఎంత, టీడీపీ పార్టీ పాత్ర ఎంత అనే అంశాల్ని ప్రస్తావించారు. అయితే మధ్యంతర నివేదిక మాత్రమే కావడంతో పూర్తి వివరాలను మాత్రం ఇవ్వలేదు. అయితే సమాచారం లీకేజ్ పై ఇచ్చిన వివరాలు సంచలనం రేపేలా ఉన్నాయి. అలాగే మరికొంత మందిని విచారణ చేయాల్సి ఉందని సభాసంఘం పేర్కొంది.

టీడీపీకి చెందిన సేవామిత్ర యాప్ కు ప్రభుత్వ డేటా లీక్ అయిందని, ఇందుకు పెగాసస్ స్పైవేర్ వాడకమే కారణమని సభాసంఘం తమ నివేదికలో ఆరోపించింది. రాష్ట్ర సమాచార కేంద్రంలో గోప్యం గా ఉండాల్సిన సమాచారాన్ని సేవా మిత్ర యాప్ కు అప్పగించారని పేర్కొంది. చాలా అంశాలు విచారణ చేసిన తరవాత టీడీపీ ఈ చౌర్యానికి పాల్పడినట్టు గుర్తించామని సభాసంఘం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ప్రజల కు చెందిన గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని ప్రైవేటు కు అప్పగించారన్నారు.

ప్రభుత్వ డేటాను సేవామిత్ర యాప్ కు పంపడం ద్వారా టీడీపీకి ఓటు వేయని వ్యక్తుల వివరాలు తెలుసుకుని వారి ఓట్లను తొలగించేందుకు ఈ యాప్ ద్వారా ప్రయత్నాలు చేశారని సభా సంఘం తమ నివేదికలో తెలిపింది. టీడీపీకి ఓటు వేయని వారి ఓట్లు రద్దు చేసే ప్రక్రియకు ఈ యాప్ ద్వారా శ్రీకారం చుట్టారన్నారు. ఇప్పటి వరకూ 4 దఫాలు సభా సంఘం సమావేశమై విచారణ జరిపామని, అధికారులు, శాఖల అధికారులు నుంచి వివరాలు సేకరించినట్లు సభాసంఘం ఛైర్మన్ భూమన వెల్లడించారు. ప్రస్తుతానికి మధ్యంతర నివేదిక రెండు ప్రతులు మాత్రమే సభకు సమర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒకటికి స్పీకర్ కు, మరొకటి ప్రభుత్వానికి ఇస్తున్నామన్నారు.