ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు బిల్లు-అసెంబ్లీలో సర్కార్ సమర్ధన- టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును దివంగత వైఎస్సార్ పేరుతో మారుస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆరోగ్యమంత్రి విడదల రజనీ బిల్లు ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ కొనసాగుతోంది. ఇందులో ప్రభుత్వం హెల్త్ వర్శిటీ పేరుమార్పును సమర్ధించుకుంది. దీనిపై నిరసనకు దిగిన టీడీపీ ఎమ్మెల్యేల్ని సస్పెండ్ చేశారు.

ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశం కాగానే టీడీపీ ఎమ్మెల్యేలు హెల్త్ వర్శిటీ పేరు మార్పు నిర్ణయంపై నిరసనలు చేపట్టారు. దీంతో స్పీకర్ వారిని వారించే ప్రయత్నం చేసారు. అయినా వారు పట్టించుకోలేదు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని పేరు మార్పు సవరణ బిల్లు ప్రతుల్ని చించి పడేశారు. దీంతో స్పీకర్ 13 మంది టీడీపీ ఎమ్మెల్యేల్ని సభలో నుంచి సస్పెండ్ చేశారు. వారు సభలో నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆరోగ్యమంత్రి విడదల రజనీ సభలో ఈ మేరకు సవరణ బిల్లు ప్రవేశపెట్టారు.

అనంతరం బిల్లుపై మంత్రి విడదల రజనీ మాట్లాడారు.ఎన్టీఆర్ గురించి చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. అలాగే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో ఎన్టీఆర్ పేర్ల మార్పు గురించి చంద్రబాబు చర్చించిన వీడియోను కూడా సభలో ప్రదర్శించారు. ఎన్టీఆర్ గురించి చంద్రబాబు ఏం మాట్లాడారో అందరికీ తెలుసని ఆమె అన్నారు.

ఎన్టీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబకు లేదన్నారు. గతంలో ఆరోగ్యశ్రీ పధకానికి వైఎస్సార్ పేరు తీసేసి ఎన్టీఆర్ పేరు పెట్టుకోలేదా అని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ లో నైతిక విలువలు శూన్యమని చంద్రబాబు గతంలో అన్నారని రజనీ గుర్తుచేశారు.