ఎన్టీఆర్ పేరెత్తే అర్హత ఆయనొకక్కరికే – స్పీకర్ పైకి పేపర్లు: రక్షణగా వచ్చిన మంత్రులు..!!

ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీలో రగడ జరిగింది. ఏపీ అసెంబ్లీ చివరి రోజు సమావేశాల ప్రారంభంలోనే టీడీపీ సభ్యులు ఇదే అంశం పైన నిరసనకు దిగారు. విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మారుస్తూ బిల్లు ఈ రోజు సభలో ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమైంది. దీనికి సంబంధించి ఆన్ లైన్ విధానంలో మంత్రుల నుంచి ఆమోదం తీసుకున్నారు. ఇక, ఈ రోజు సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఇదే విషయం పైన ఆందోళన చేసారు. ఆ సమయంలో సభలో రగడ చోటు చేసుకుంది.

జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చొద్దంటూ నినాదాలు చేశారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై బిల్లు పెట్టినప్పుడు అభిప్రాయం చెప్పాలని స్పీకర్ తెలిపారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు తమ నిరసనను కొనసాగిస్తుండటంతో సభలో గందరగోళం నెలకొంది.

సభ్యుల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగించే ప్రయత్నం చేసారు. అయితే, టీడీపీ సభ్యుల తీరుపైన మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రస్తుతం సభలో ఉన్న వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మినహా మరెవరికీ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించే అధికారం లేదని వ్యాఖ్యానించారు.

మిగిలిన వాళ్లంతా చంద్రబాబుతో కలిసి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సభలో బిల్లు ప్రతిపాదించిన సమయంలో టీడీపీ సభ్యులు చర్చలో పాల్గొని తమ విధానం చెప్పాలని సూచించారు. శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త గా శ్రీకాంత్ రెడ్డి గతంలో టీడీపీ చాలా సార్లు వైఎస్సార్ పేరు మార్చిందని చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ కు గౌరవం ఇచ్చేందుకే తాము జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టామని వివరించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు. ఆరు సార్లుగా చంద్రబాబు దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తున్నారని ఆరోపించారు.

ఎన్టీఆర్ పేరెత్తే అధికారం చంద్రబాబు..ఎమ్మెల్యేలకు లేదన్నారు. చంద్రబాబు తమ ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చి సభలో గొడవ చేయటానికి పంపిస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో..పోడియం చుట్టిముట్టిన టీడీపీ సభ్యులు – వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్పీకర్ పైన టీడీపీ ఎమ్మెల్యేలు కాగితాలు విసిరేసారు. ఆగ్రహించిన స్పీకర్ తన హెడ్ ఫోన్స్ ను టేబుల్ పైన గట్టిగా పడేసారు.

అదే సమయంలో మంత్రులు – కొందరు ఎమ్మెల్యేలు స్పీకర్ కు రక్షణగా పోడియం వద్దకు వచ్చారు. రెండు పక్షాల నుంచి మాటా మాటా పెరిగే సందర్బంలో స్పీకర్ కొద్ది సేపు సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సభ ప్రారంభమైన తరువాత ఇదే అంశం పైన సభలో వివాదం చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.