ఎన్టీఆర్ పేరు మార్పు ప్రకంపనలు : పదవికి యార్లగడ్డ రాజీనామా – వల్లభనేని వంశీ ఇలా..!!

ఎన్టీఆర్ హల్త్ వర్సిటీ పేరు మార్పు ప్రతిపాదనపైన నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వంలో రాజీనామాలు వరకు వెళ్లాయి. నేటి సభలో ఈ మేరకు బిల్లు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమయంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఈ ప్రతిపాదన ఉప సంహరించుకోవాలని కోరుతూ నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం ఎక్కి పేపర్లు చింపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. సభలో స్పీకర్ పోడియం పైన వద్ద చోటు చేసుకుంటున్న పరిణామాలతో మంత్రులు – వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లి స్పీకర్ కు అడ్డుగా నిలుచునున్నారు. దీంతో సభ వాయిదా పడింది.

ఆ తరువాత సమావేశమైన సభ ప్రారంభమైన తరువాత ఇదే రకంగా పరిస్థితి ఉండటంతో..టీడీపీ సభ్యులు సభ నుంచి సస్పెండ్ చేసారు. ఇక, అధికార పార్టీలోనూ ఈ నిర్ణయం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సభలో మంత్రులు..వైసీపీ ఎమ్మెల్యేలు ఈ ప్రతిపాదనను సమర్ధిస్తున్న సమయంలో..అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేసారు.

ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం చాలా బాధగా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పేరు తొలగించడం సరైన నిర్ణయం కాదు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన రాజీనామా నిర్ణయం ప్రకటించారు. జగన్ హీరో అయినా..పేరు మార్పు నిర్ణయంతో మనస్థాపానికి గురైనట్లు చెప్పారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి గెలిచి..వైసీపీకి దగ్గరైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం ఈ నిర్ణయం మార్చుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి జగన్ ఎంతో పెద్ద మనసుతో నందమూరి తారక రామారావు పేరుతో జిల్లా ఏర్పాటు చేసి, టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇవ్వని గుర్తింపు ఇచ్చి స్పూర్తిగా నిలిచారని గుర్తు చేసారు. ఇదే సమయంలో..ఆ నిర్ణయం ఎంతో విప్లవాత్మకం – చారిత్మాకంగా పేర్కొన్నారు. అదే జిల్లాలో ఎన్టీఆర్ చొరవతో ఏర్పాటైన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కారణజన్ముడైన ఆ మహానీయుడు పేరు కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని వల్లభనేని వంశీ ముఖ్యమంత్రిని కోరారు.

విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బట్టారు. ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేసే వరకూ రాష్ట్రంలో ఎక్కడా ఆరోగ్య విశ్వవిద్యాలయాలు లేవని గుర్తు చేసారు. అటు బీజేపీ నేతలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

ఎన్టీఆర్ పేరు మార్చటం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంట గలపటమేనని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైద్య కళాశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకుని వచ్చేందుకు ఎన్టీఆర్ పడిన తపన గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు.

ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయాల్లో ఎన్టీఆర్ కు గౌరవం పెంచుతూ..చంద్రబాబును ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాలను ఇప్పటి వరకు అమలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ నిర్ణయంతో ఒక్క సారి సీన్ మారిపోయింది. టీడీపీ దీనిని తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. మరి..ఈ స్థాయిలో నిరసనలు వస్తున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తారా లేక.. పునరాలోచన చేస్తారా అనేది చూడాల్సి ఉంది.