ఎన్టీఆర్ అంటే నాకు గౌరవం – పేరు మార్పు నిర్ణయం ఎందుకంటే : సభలో సీఎం జగన్..!!

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయం రాజకీయంగా వివాదాస్పదమైంది. సభలో ఈ బిల్లు ప్రతిపాదించి..ఆమోదించే వేళ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఎన్టీఆర్ పైన తనకు ఎనలేని గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ పేరు ఎత్తితే నచ్చని వ్యక్తి చంద్రబాబు అని చెబుతూ… చంద్రబాబు పేరు ఎత్తినే ఇష్టపడని వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. నాడు ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడవ కుండా ఉంటే ఆయన రెండో సారి పూర్తి కాలం సీఎంగా కొనసాగేవారన్నారు. అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదని వ్యాఖ్యానించారు.

నాడు ఎన్టీఆర్ సమయంలో వైఎస్సార్ ప్రతిపక్ష నేతగా ఉన్నా .. తమ పార్టీ ఏనాడు ఎన్టీఆర్ పైన ఒక్క వ్యాఖ్య కూడా చేయలేదన్నారు. తన పాదయాత్ర సమయంలో క్రిష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టమని ఎవరూ అడగకుండానే హామీ ఇచ్చానని, అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేసామని ముఖ్యమంత్రి చెుప్పారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఎన్టీఆర్ పేరు ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని వివరించారు. ఎన్టీఆర్ పైన చంద్రబాబుకు ఎంత గౌరవం ఉందో ఒక పత్రికాధిపతితో జరిగిన సంభాషణలో స్పష్టమైందని వ్యాఖ్యానించారు. ఎంతో మంది రాష్ట్రపతులు..ప్రధానులను తానే చేసానని చెప్పుకొనే చంద్రబాబు అసలు ఎన్టీఆర్ కు భారతరత్న ఎందుకు ఇప్పించ లేకపోయారో చెప్పాలన్నారు.

ప్రధాని మోదీ తనకంటే జూనియర్ అని అడిగినా- అడగకపోయినా చంద్రబాబు పదే పదే చెబుతున్నారని ఎద్దేవా చేసారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్పు నిర్ణయం సరైనదా కాదా అనే అంశం పైన తాను ఎంతో ఆలోచించానని చెప్పారు. అన్నీ కోణాల్లో పరిశీలించిన తరువాత ఇదే సరైన నిర్ణయంగా భావించానని వివరించారు. వైఎస్సార్ ఒక వైద్యుడని.. మంచి వైద్యుడుగా పేరు సంపాదించారని గుర్తు చేసారు. ఆయన హయాంలో తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ ఇప్పటికీ పేదల పాలిట వరమని వివరించారు. 1983 టీడీపీ ఏర్పాటుకు ముందే ఏపీలో మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. వైఎస్సార్ హయాంలో మూడు కాలేజీలు వచ్చాయన్నారు. అదే విధంగా తన హయాంలో ఏపీలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు అవుతున్నాయని సీఎం వెల్లడించారు.

ఇంత పెద్ద మొత్తంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్న సమయంలో ఆ క్రెడిట్ వైఎస్సార్ కు ఇవ్వాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలో వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా అందిస్తున్న సేవలను ముఖ్యమంత్రి వివరించారు. టీడీపీ తమ హయాంలో నిర్మించినవి ఏమైనా ఉంటే..వాటికి ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. టీడీపీ అటువంటివి ఉంటే తనకు పంపాలని, వెంటనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఆ వెంటనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రతిపాదించిన బిల్లును సభలో ఆమోదించారు. ఉదయం నుంచి ఇదే అంశం పైన సభలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసారు.