ఉక్రెయిన్‌పై యుద్ధం ఏడు నెలలకు చేరిన వేళ.. పుతిన్ సంచలనం ప్రకటన: మోదీని కాదని

మాస్కో: ఏడు నెలలుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన యుద్ధానికి అంతు ఉండట్లేదు. బ్రేకులు పడట్లేదు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గట్లేదు. సై అంటే సై అంటోన్నాయి. రష్యా సాగిస్తోన్న దాడులను ఉక్రెయిన్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది..తిప్పి కొడుతోంది.

ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిని రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. రాజధాని కీవ్‌ను చుట్టుముట్టినప్పటికీ.. అంత తేలిగ్గా లొంగట్లేదు. రాజధానిని కాపాడుకోవడంలో ఉక్రెయిన్ సైన్యం శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది.

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, యూరోపియన్ యూనియన్ సహా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలు అందజేస్తోన్న ఆయుధ సామాగ్రితో రష్యా దూకుడును అడ్డుకుంటోంది ఉక్రెయిన్ సైన్యం. ఈ క్రమంలో రెండు వైపులా పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. ఈ పరిణామాల మధ్య రష్యా మరింత రెచ్చిపోతోంది. జనావాసాలను సైతం లెక్క చేయట్లేదు. పునరావాస భవనాలపైనా దాడులను సాగిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి.

ఈ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. కీలక ప్రకటన చేశారు. సైనిక బలగాలన్ని మరింత సమీకరించుకోనున్నట్లు వెల్లడించారు. పాక్షికంగా సైనిక శక్తిని బలోపేతం చేసుకోనున్నట్లు చెప్పారు. పాశ్చాత్య దేశాలు తమ హద్దులను దాటాయని, రష్యాను బలహీనపరచడానికి, విభజించడానికి కుట్ర పన్నాయని ఆరోపించారు. రష్యా అంతు చూడాలంటూ పశ్చిమ దేశాలు పిలుపునిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

పాశ్చాత్య దేశాలు రష్యా విచ్ఛిన్నానికి కుట్ర పన్నినప్పటికీ- తమ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక లక్ష్యాల్లో ఏ మాత్రం మార్పు ఉండదని పుతిన్ తేల్చి చెప్పారు. లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ పూర్తిగా విముక్తి పొందిందని ప్రకటించారు. డొనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ పాక్షికంగా విముక్తి సాధించిందని అన్నారు. తూర్పు-దక్షిణ ఉక్రెయిన్‌లోని రష్యా ఆధీన ప్రాంతాలు తమదేశంలో అంతర్భాగంగా మారడంపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని ప్రకటించిన ఒకరోజు తరువాత పుతిన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ ప్రజాభిప్రాయ సేకరణలు లుహాన్స్క్, ఖెర్సన్, పాక్షికంగా రష్యా ఆధీనంలో ఉన్న ఝపోరిజ్జియా, డొనెట్స్క్ రీజియన్లల్లో శుక్రవారం ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో పాక్షికంగా సైన్యాన్ని సమీకరించడానికి ఉద్దేశించిన డిక్రీపై సంతకం చేసినట్లు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. పాశ్చాత్య దేశాలు రష్యాను నాశనం చేయాలని భావిస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. తూర్పు ఉక్రెయిన్‌ రీజియన్‌లోని డాన్‌బాస్ ప్రాంతానికి విముక్తి కల్పించడమే తన లక్ష్యమని అన్నారు.

దీన్ని బట్టి చూస్తే- పుతిన్ మరింత కాలం యుద్ధాన్ని కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఉజ్బెకిస్తాన్‌‌లో ఇటీవలే ముగిసిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలను పుతిన్ పెద్దగా పట్టించుకోనట్టే. ఇది యుద్ధానికి సరైన సమయం కాదని, ప్రత్యామ్నాయంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలంటూ మోదీ సూచించారు.